ఇక‌, మిగిలింది నాలుగు రోజేలే.. మ‌రిన్ని అస్త్రాలు వెలుగులోకి!

Update: 2022-10-28 14:30 GMT
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక జ‌రిగేందుకు మ‌రో నాలుగు రోజులే మిగిలింది. శుక్ర‌, శ‌ని, ఆది, సోమ‌వారాల‌తో ఇక్క‌డ జ‌రుగుతున్న రాజ‌కీయ పార్టీల ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. న‌వంబ‌రు 3న ఉప ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీనికి ముందు రోజు నుంచి ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌చారం ముగియ‌నుంది.

దీంతో ప్ర‌ధాన పార్టీలు.. టీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్ర‌చార ప‌ర్వాన్ని జోరుగా సాగిస్తున్నాయి. కొంద‌రైతే.. అన్నం తిన‌డం కూడా మ‌రిచిపోయి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. మంత్రులు..జ‌గ‌దీష్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌లు ఇళ్ల‌కు కూడా వెల్ల‌డం మానేశారు.

మునుగోడులోనే టీఆర్ ఎస్ ఒక పెద్ద ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. అక్క‌డే వీరు రాత్రి వేళ ఇతర నేత‌ల‌తో క‌లిసి నేల‌పై నిద్రిస్తున్నారు. వీటిని సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారం చేస్తున్నారు. `మీకోసం.. మ‌న నాయ‌కులు` క్యాప్ష‌న్‌తో వీరు నేల‌పై నిద్రిస్తున్న ఫొటోలు రెండు రోజులుగా మునుగోడులో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఇక‌, బీజేపీ నాయ‌కులు ఈట‌ల రాజేంద‌ర్, అభ్య‌ర్థికోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌లు కూడా.. ఇళ్ల‌కు వెళ్ల‌డం మానేశారు. ఈట‌ల అయితే.. చెట్ల మ‌ధ్య పొలాల గ‌ట్టున కూర్చుని.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి అన్నం తింటూ.. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌, కాంగ్రెస్ కూడా ప్ర‌చారం పెంచింది. కీల‌క నేత‌లు.. రంగంలోకి దిగాల్సి ఉన్నా.. ప్ర‌స్తుతం భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతున్నందున అక్క‌డే ఉంటున్నారు. దీంతో అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతికి మ‌ద్ద‌తుగా కొంద‌రిని మాత్రం పార్టీ నేత‌లు కేటాయించారు. అయితే.. భారత్ జోడో యాత్ర కూడా .. త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని ఆమె భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న ప్ర‌చారం భార‌త్ జోడోయాత్ర‌ను కూడా ఆమె ప్ర‌స్తావిస్తున్నారు. ఇదిలావుంటే.. అటు బీజేపీ త‌ర‌ఫున కీల‌క నేత‌లు రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ‌స్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనికి ఆదివారం ముహూర్త‌మ‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా కూడా.. ఆదివార‌మే వ‌స్తార‌ని.. ఇద్ద‌రూక‌లిసే ప్ర‌చారం చేస్తార‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. అయితే.. ఇది ఇంకా షెడ్యూల్ కాలేదు.

మ‌రోవైపు.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇక్క‌డ నాలుగు రోజులు ప్ర‌చారం చేయాల‌ని అనుకున్నా.. తాజాగా వెలుగు చూసిన ఫామ్‌హౌజ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు. ఆయ‌న చివ‌రి రోజు.. అంటే.. సోమ‌వారం ఇక్క‌డ ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కాంగ్రెస్ త‌ర‌ఫున మాత్రం పెద్ద నేత‌లు ఎవ‌రూ వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఏదేమైనా ఈ నాలుగు రోజులు మాత్రం అత్యంత కీల‌కంగా భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News