టీడీపీలో 'విష్ణు' మాయ‌.. వ‌స్తారా.. రారా..?

Update: 2023-05-10 13:32 GMT
టీడీపీని విష్ణుమాయ క‌మ్మేసింది!  తాజాగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న వినిపిస్తున్న కామెంట్ ఇది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర బీజేపీలో క‌ల‌క‌లం రేపాయి. త‌ను టీడీపీలోకి వెళ్లాల‌నే విష‌యాన్ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పారు. మూడు పార్టీలుక‌లిస్తే.. వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. క‌ల‌వ‌క‌పోతే.. ప్ర‌జాభిప్రాయం ప్ర‌కారం తాను నిర్ణ‌యం తీసుకుంటాన‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.

అదేస‌మ‌యంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ ఒక్క‌సీటు కూడా పొంద‌ద‌ని తాను నేరుగా ప్ర‌ధాని మోడీకే చెప్పి న‌ట్టు వివ‌రించారు. ఈ రెండువిష‌యాలు కూడా.. పార్టీలో క‌ల‌క‌లానికి కార‌ణం అయ్యాయి. దీంతో విష్ణుకు రాష్ట్ర నేత‌ల ఫిర్యాదుతో కేంద్ర నాయ‌క‌త్వం.. షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  అయితే.. బీజేపీ సంగ‌తి ఎలా ఉన్నా.. ఇప్పుడు టీడీపీలో విష్ణు విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న పార్టీలోకి వ‌చ్చేసేందుకు సిద్ధ‌మేన‌ని పార్టీలోనూ కొంద‌రు చెబుతున్నారు.

విష్ణు వ‌స్తే.. పార్టీకి ఒరిగేది ఎలా ఉన్నా.. ఒక్క‌స్థానం మాత్రం టీడీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంది. ఆ ఒక్క‌సీటు కోసం.. టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తే.. విష్ణువ‌స్తే.. ఇది బీజేపీకి మ‌రింత ఇబ్బంది క‌దా? అనేది టీడీపీలో చ‌ర్చ‌. ప్ర‌స్తుతం బీజేపీతో చేతులు క‌లిపి.. ఒక ర‌క్ష‌ణ తెచ్చుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని చంద్ర బాబు యోచిస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల కీల‌క‌మైన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను పార్టీలో చేర్చుకోవ‌డంపై.. బీజేపీ పెద్ద‌లు గుర్రుగా ఉన్నారు.

ఏ పార్టీ ఏ పార్టీతో చేతులు క‌లిపినా.. వ్య‌క్తిగ‌త ఆశ‌లు, ఆకాంక్ష‌లు ఉంటాయి. టీడీపీ.. బీజేపీతో ఎందుకు చేతులు క‌లుపుతోంది.. అంటే.. అధికారంలో కి వ‌చ్చేందుకు. మ‌రి బీజేపీ ఎందుకు టీడీపీతో చేతులు క‌ల‌పాలి.. అంటే.. అంతో ఇంతో బ‌ల‌ప‌డాల‌నే ఉద్దేశంతోనే క‌దా! మ‌రి అలాంటి పార్టీ నుంచి కీల‌క నేత‌ల‌ను రాబ‌ట్టుకుంటే.. టీడీపీకి బీజేపీ ఎలా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌నే చిన్న లాజిక్‌.. ఇప్పుడు టీడీపీలో చ‌ర్చ‌కు దారి తీసింది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారోచూడాలి.

Similar News