*రేవంత్ పాదయాత్ర ఉన్నట్లా లేనట్లా?*

Update: 2023-01-17 00:30 GMT
ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పాదయాత్రలపై నాయకులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయగా, వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఏపీలో లోకేశ్ ఈ నెలాఖరు నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన వారాహి వాహనంలో ఆల్ ఆంధ్ర యాత్రకు రెడీ అవుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరింది.. కానీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్టంబన తొలగలేదు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో జాతీయ స్థాయిలో అంతటా యాత్రలు మొదలుపెట్టనుంది.. ఇది జనవరి 26న ప్రారంభమవుతుంది. రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలంతా తెలంగాణలో ఈ యాత్రల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ.. అదే రోజున రేవంత్ పాదయాత్ర కూడా ప్రారంభం కావాల్సి ఉంది. హాత్ సే హాత్ జోడో యాత్ర అనౌన్స్ కావడానికి ముందే రేవంత్ తన యాత్రను అనౌన్స్ చేశారు. కానీ, ఇప్పడు జాతీయ స్థాయి కార్యక్రమం కోసం తన ప్రోగ్రామ్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి.రేవంత్ హైదరాబాద్ తప్ప మిగతా తెలంగాణ అంతటా యాత్ర చేయాలని ప్లాన్ చేశారు. 126 రోజుల పాటు 99 నియోజకవర్గాలను తిరగాలన్నది రేవంత్ రెడ్డి ప్లాన్.

అయితే.. హాత్ సే హాత్ యాత్ర మధ్యలో రావడంతో రేవంత్ యాత్ర షెడ్యూల్ ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. రూట్ మ్యాప్ ఇంకా ప్రకటించలేదు. జోగులాంబ గద్వాల నుంచి ప్రారంభిస్తారని మొదటి నుంచి చెప్తున్నా ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అలాగే.. ఖమ్మంలో కేసీఆర్ భారీ సభ పెడుతుండడం.. బీఆర్ఎస్ నేత పొంగులేటి బీజేపీలో చేరుతుండడం వంటి రాజకీయ పరిణామాలతో ఖమ్మంలో అనిశ్చితి ఉండడంతో అక్కడి నుంచి యాత్ర మొదలుపెట్టి నేతల దృష్టి కాంగ్రెస్ వైపు పడేలా చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.

మరోవైపు రేవంత్ పాదయాత్రకు ఏఐసీసీ అనుమతి లేదని ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. తనకు ఢిల్లీ నేతల నుంచి ఎలాంటి సమాచారం లేదని.. పాదయాత్ర ఉండకపోవచ్చని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. పైగా రేవంత్‌కు గట్టి మద్దతుదారు అయిన మాణిక్యం ఠాగూర్ తెలంగాణ ఇంచార్జి స్థానం నుంచి బదిలీ అయి ఆయన స్థానంలో మాణిక్ రావు రావడంతో రేవంత్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందన్నది సందేహంగా మారింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ యాత్ర వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News