ర‌గులుతున్న `లంకా` ద‌హ‌నం.. ఎందుకు? ఏమిటి?

Update: 2022-07-09 14:58 GMT
గత కొంత కాలంగా తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం బారిన చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు అదుపుతప్పాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ శ్రీలంక అంతటా గత మార్చి నుంచి ఆందోళనలు కొనసాగుతుండగా, శనివారం అవి మరింత తీవ్ర రూపం దాల్చి రాజధాని కొలంబో రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో.. తన అధికారిక నివాసాన్ని వదిలి లంక అధ్యక్షుడు గొట‌బాయ పారిపోయారు. మరోవైపు అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనని ప్రకటించిన ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.

అధికారిక నివాసం ముట్టడికి ఆందోళనకారులు ముందే పిలుపునివ్వగా, గొటబాయ రాజపక్స ఆ భవనాన్ని వదిలిపెట్టారు. ఆయన దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనను అధికారులు అధ్యక్ష భవనం నుంచి తప్పించినట్లు తెలిసింది.

అయితే, ఆయన ఆచూకీ తెలియరాలేదు. నిఘా వర్గాలు ఊహించినట్లుగానే అధ్యక్ష భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. 'దేశమంతా కొలంబో వైపే' అని వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది ఆందోళనకారులు శ్రీలంక రాజధాని చేరుకున్నారు.

కొలంబోలో మెగా ర్యాలీ నిర్వహించిన లక్షలాది మంది అత్యంత పటిష్ఠ భద్రత ఉండే ఫోర్ట్‌ ఏరియా ప్రాంతంలోని అధ్యక్ష భవనం ముట్టడికి బయలుదేరారు. భద్రతా బలగాలు అడ్డుకున్నా బారికేడ్లను తోసి పలువురు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకువెళ్లారు.

ఆందోళనకారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అధ్యక్ష కార్యాలయ ముట్టడికి యత్నించగా, దాన్ని వదిలి ఆయన అప్పటి నుంచి పటిష్ఠ భద్రత ఉండే అధికార నివాసం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఆందోళనకారులు ముందే నిరసనలకు పిలుపునివ్వడం వల్ల కొలంబోలోని ఏడు డివిజన్లలో శుక్రవారం రాత్రి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కర్ఫ్యూ విధించారు. అయితే మానవ హక్కుల సంఘాలు, న్యాయవాద సంఘాలు వ్యతిరేకించడంతో   కర్ఫ్యూను ఎత్తివేశారు.

ఈ నేపథ్యంలో అధ్యక్ష భవనం వద్దకు ఆందోళనకారులు భారీగా చేరుకున్నారు. భద్రతా బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకున్నా వారు వెనక్కి తగ్గలేదు. ఆందోళనకారులకు సైన్యం కూడా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించారు. అయినా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఘర్షణల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 30 మంది గాయపడినట్లు సమాచారం. ప్రజా ఆందోళనలకు తలొగ్గి గొటబాయ సోదరుడు మహింద రాజపక్స.. ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News