పీచేముఢ్... వైసీపీ నుంచి వారంతా జంప్...?

Update: 2022-11-05 02:30 GMT
రాజకీయాల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ చేయడం ఈ రోజుల్లో ఆశ్చర్యం కానే కాదు, కన్యాశుల్కం లో గిరీశం చెప్పినట్లుగా ఒపీనియన్స్ మాత్రమే కాదు పార్టీలను మార్చకపోతే నాయకులే కాదు. అలా టీడీపీ నుంచి కీలక నేతలు అంతా 2019 ఎన్నికల తరువాత వైసీపీ గెలిచాక ఆ వైపుగా దూసుకువచ్చారు. వారిని వైసీపీ కూడా అక్కున చేర్చుకుంది. వారి అండతో సార్వత్రిక ఎన్నికలే కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ  విజయం సాధించింది.

అయితే వారికి మాత్రం ఏ పదవులూ ఇవ్వకుండా బాగా ఎండబెట్టేసింది. సాధారణంగా నాయకులు అన్న వారు పార్టీ మారేదే పదవుల కోసం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్క ఏడాది రెండేళ్లు కాదు మూడున్నరేళ్ళుగా అలా పస్తులు ఉంచేసేసరికి వారికి వైసీపీ మీద  విసుగు కోపం చికాకు మొత్తం కలుగుతున్నాయి. దానికి తోడు ఇక పదవులు ఏవీ రావు అని తేలిపోతున్న వేళ ఎన్నికలు ముంచుకువస్తున్న వేళ వైసీపీకి  పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కూడా గమనించి ఆ గూటి నుంచి తొందరగా సేఫెస్ట్ ప్లేస్ కి జంప్ చేయడమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారుట.

ఆ విధంగా చూసుకుంటే ముందు వరసగా అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన జనసేన వైపు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం దాడి మరోసారి పార్టీని ఏడు పదుల వయసులో మారడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశించినా జగన్ ఇవ్వలేదు అని ఆగ్రహం ఉందని చెబుతారు.

ఇక మైనారిటీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, విశాఖ సిటీకి చెందిన డాక్టర్ ఎస్ ఎ రహమాన్ కూడా వైసీపీలో సరైన పదవుల కోసం ఎదురు చూసి విసిగిపోయారు. ఆయన ఎమ్మెల్సీ అయినా లేక నామినేటెడ్ పదవి అయినా వరిస్తుంది అనుకుంటే అంతా ఉల్టా సీదా అయిందని బాధపడుతున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో విశాఖ సౌత్ కానీ నార్త్ కానీ టికెట్ కావాలనుకున్నా దక్కే సీన్ లేదని అంటున్నారు. దాంతో ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఇదే వరసలో మరో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని అంటున్నారు. తన కుమార్తె ధరణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోసం ఆయన ట్రై చేసినా ఇవ్వలేదు. ఇక పాడేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. దాంతో బాలరాజు సైతం ఏదో ఒక పార్టీని చూసుకోవాలని అనుకుంటున్నారుట.

ఇదే విధంగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ గూటి నుంచి బయటకు రావాలని చూస్తున్నారు. గాజువాకకు చెందిన తిప్పల గురుమూర్తిరెడ్డి తిరిగి టీడీపీకి జై అనేసేలా ఉన్నారు. అలాగే విశాఖ సిటీకి చెందిన  మరో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ కూడా సైకిలెక్కేస్తే ఎలా ఉంటుంది అని చూస్తున్నారుట. ఇక టీడీపీలో కీలకమైన జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన సామాజికవర్గానికి చెందిన పంచకర్ల రమేష్ బాబు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

జనసేన వైపు ఆయన వెళ్తారు అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి చూస్తే వీరంతా  వివిధ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులు. వీరంతా వైసీపీకి దూరం జరిగితే మాత్రం అనేక నియోజకవర్గాలలో వారి ప్రభావం కచ్చితంగా ఉంటుంది అంటున్నారు. మరి జగన్ వీరిని ఏ విధంగా గడప దాటకుండా చూసుకుంటారో అన్నదే చర్చగా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News