లేడీస్ టైలర్.. కట్ చేస్తే ఐఎస్ఐ ఏజెంట్

Update: 2021-03-13 05:38 GMT
గుజరాత్ కు చెందిన ఇమ్రాన్ గిటేలిని చాలామంది లేడీస్ టైలర్ గా.. ఆటో డ్రైవర్ గా గుర్తుపెట్టుకుంటారు. కానీ.. అతను ఆ రెండింటి కంటే మిన్నగా పాక్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ.. దేశ రహస్యాల్ని అమ్మేసే దుర్మార్గానికి పాల్పడ్డాడు. విశాఖ గూఢచర్య రాకెట్ కేసులో గత ఏడాది సెప్టెంబరులో అరెస్టు అయిన అతనికి సంబంధించి దర్యాప్తు రిపోర్టును తాజాగా విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. ఇందులో పలు సంచలన అంశాల్ని పేర్కొన్నారు. అందులోని కీలక అంశాల్ని చూస్తే..

లేడీస్ టైలర్ గా పని చేసే యాకూబ్ ఇమ్రాన్ గిటేలీ ఆరోగ్య సమస్యలు రావటంతో ఆ పనిని మానేసి ఆటో నడపటం షురూ చేశాడు. తర్వాతి కాలంలో కరాచీ వస్త్రాల్ని భారత్ లో అమ్మే పని మొదలు పెట్టాడు. తన బంధువులు కరాచీలో ఉంటారని.. వారి ద్వారా వచ్చే వస్త్రాల్ని అమ్మేక్రమంలో దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే ముఠాతో పరిచయమైంది. క్రమంగా ఐఎస్ఐ చేతుల్లోకి వెళ్లిపోయిన ఇతను.. దేశంలోని కీలక సంస్థలు.. రక్షణ స్థావరాలు.. అంతరిక్ష పరిశోధన కేంద్రాల ఫోటోలు.. వీడియోలతో పాటు ఇతర రక్షణ రహస్యాలు.. వ్యూహాత్మక స్థావరాల వివరాల్ని సేకరించేవాడు.

వాటిని ఎప్పటికప్పుడు పాకిస్థాన్ నిఘా విభాగానికి అందించేవాడు. తాను చేసే దరిద్రపుగొట్టు పనులకు సాయం చేసే విశాఖనేవీ అధికారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేవాడు. ఏడాది వ్యవధిలో దేశంలోని వివిధ వ్యక్తుల ఖాతాల్లోకి రూ.65 లక్షల మొత్తాన్ని యాకూబ్ బదిలీ చేసినట్లుగా గుర్తించారు. ఇతడికి సాయం చేసిన పదకొండు మంది నేవీ ఉద్యోగులతో సహా పద్నాలుగు మందిపైన అభియోగాల్ని మోపారు. ఇతని వివరాల్ని సేకరించిన దర్యాప్తు సంస్థ.. మిగిలిన వారి లెక్క తేల్చే పనిలో పడింది.
Tags:    

Similar News