రాజీనామా చేసే దిశ‌గా ఏపీ మంత్రి?

Update: 2017-12-29 09:00 GMT
ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం చోటు చేసుకోనుందా? అంటే..  అవున‌నే మాట వినిపిస్తోంది. వ‌రుస అవ‌మానాల‌తో తీవ్ర ఆవేద‌న‌కు గురి అవుతున్న ఏపీ డిప్యూటీ ముఖ్య‌మంత్రి క‌మ్ హోం మంత్రి నిమ్మ‌కాయల‌ చిన్న‌రాజ‌ప్ప రాజీనామా చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో అదృశ్య హ‌స్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్న  కీల‌క నేత పుణ్య‌మా అని.. ఎదుర‌వుతున్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌తో పోలిస్తే.. రాజీనామా చేసేయ‌టం మంచిద‌న్న భావ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు.

పేరుకు హోం మంత్రి అయినా.. కిందిస్థాయి పోలీసు అధికారుల వ‌ద్ద కూడా చిన‌రాజ‌ప్ప ప‌వ‌ర్ ప‌ని చేయ‌టం లేద‌న్న మాట ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టం.. చిన్న‌చూపు చూడ‌టంపై  ఆయ‌న తీవ్ర అస‌హ‌నంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే ముఖ్య‌మంత్రి వ‌స్తున్న కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌రు కావ‌టం ద్వారా త‌న నిర‌స‌న‌ను బాబుకు తెలిసేలా చేసిన‌ట్లుగా స‌మాచారం.

వ‌రుస అవ‌మానాల‌తో చిన‌రాజ‌ప్ప ర‌గులుతున్న అగ్నిప‌ర్వతంలా ఉన్నార‌ని.. భ‌రించ‌లేని స్థితిలో ఆయ‌న బ‌ద్ధ‌లు కావ‌టం.. వివాద‌ర‌హితుడిగా ఉన్న చిన‌రాజ‌ప్ప నుంచి ఇంత తీవ్ర‌మైన రియాక్ష‌న్ ఉండ‌టం బాబును సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. చిన‌రాజ‌ప్ప రాజీనామా యోచ‌న విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబు రంగంలోకి దిగి.. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల ఏపీలో పోరెన్సిక్ ల్యాబ్ భ‌వ‌న శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి చిన‌రాజ‌ప్ప గైర్హాజ‌రు కావ‌టం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చంద్ర‌బాబు.. చిన‌రాజ‌ప్ప హాజ‌రు కాక‌పోవ‌టం ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. హోం మంత్రిత్వ శాఖ ప‌రిధిలో వ‌చ్చే కార్య‌క్ర‌మానికి ఆయ‌న రాక‌పోవ‌టం ఏమిటంటూ ఆరా తీశారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఇన్విటేష‌న్ ను ఒక కానిస్టేబుల్ చేత త‌న‌కు పంప‌టాన్ని చిన‌రాజ‌ప్ప సీరియ‌స్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త‌న నిర‌స‌న‌ను తెలియ‌జేసేందుకే.. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకుండా వేరే కార్య‌క్ర‌మానికి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే చంద్ర‌బాబు సంబంధిత అధికారుల‌పై సీరియ‌స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదేం ప‌ద్ధ‌తి అని అధికారుల్ని మంద‌లించిన‌ట్లుగా స‌మాచారం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన చంద్ర‌బాబు.. సామాజిక అంశాల్ని లెక్క‌లోకి తీసుకొని చిన‌రాజ‌ప్ప‌ను డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా ఎంపిక చేశారు. సౌమ్యుడు..  వివాదాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించే చిన‌రాజ‌ప్ప పేరుకు హోంమంత్రే కానీ.. ప‌గ్గాల‌న్నీ అదృశ్య శ‌క్తి చేతిలో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ ఎపిసోడ్ లోనూ త‌న‌ను ప‌క్క‌న పెట్టిన వైనం పైనా చిన‌రాజ‌ప్ప గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతారు. త‌న‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందిక‌ర పరిస్థితి గురించి సీఎం చంద్ర‌బాబుతో మాట్లాడాల‌ని అనుకున్నా.. అదృశ్య‌ శ‌క్తి విష‌యంలో ఆయ‌నేం చేయ‌లేర‌న్న ఆలోచ‌న‌లో ఈ ఇష్యూను చిన‌రాజ‌ప్ప తీసుకెళ్ల‌లేద‌న్న మాట వినిపిస్తోంది. చిన‌రాజ‌ప్ప రాజీనామా అంశం ఏపీ స‌ర్కారు ఇమేజ్‌ కు డ్యామేజ్ చేసే అవ‌కాశం ఉండ‌టంతో బాబు స్వ‌యంగా రంగంలోకి దిగి.. ఆయ‌న్ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. చిన‌రాజ‌ప్ప ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News