చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఏల నిర్మ‌లాజీ?

Update: 2018-10-11 12:51 GMT
మాట జార‌టం అంటే మామూలు విష‌యం కాదు. అందునా మీడియా ఎదుట మాట్లాడేట‌ప్ప‌డు  కీల‌క నేత‌లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన పార్టీకి.. ప్ర‌భుత్వానికి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెట్ట‌ట‌మేకాదు.. త‌న ఇమేజ్ ను త‌న‌కు తానుగా డ్యామేజ్ చేసుకున్న తెలివి నిర్మ‌లాజీ సొంతంగా చెప్పాలి.

రాఫెల్ ఎపిసోడ్ నేప‌థ్యంలో కేంద్ర ర‌క్ష‌ణ శాఖా మంత్రిగా నిర్మ‌ల మాట్లాడే ప్ర‌తి మాట‌కు ఎంత విలువ ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంట‌ప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన నిర్మ‌ల‌మ్మ‌.. రాఫెల్ డీల్ పై ఎన్ని పిల్లిమొగ్గ‌లు వేశారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు.

యుద్ద విమానాల ఆర్డ‌ర్ మొద‌లు.. తాము కాంగ్రెస్ కంటే ఎక్కువ విమానాలు ఆర్డ‌ర్ చేశామ‌ని ఒక‌సారి.. ఎక్కువ విమానాలు తెప్పిస్తే.. వాటి నిర్వ‌హ‌ణ వాయుసేన‌కు క‌ష్టం అవుతుంద‌ని ఒక‌సారి.. ఇలా మాట‌లు మార్చేసిన నిర్మ‌ల కార‌ణంగా మోడీ స‌ర్కారు కొత్త త‌ల‌నొప్పులు చుట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా నిర్మ‌ల మాట్లాడుతూ.. తాను గ‌తంలో చేసిన మాట‌ల్ని ప్యాచ‌ప్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చే ప్ర‌య‌త్నం చేశారు. అందులో భాగంగా ఆమె ఏం మాట్లాడారంటే.. యూపీఏ ప్ర‌భుత్వం 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు చ‌ర్చ‌లు జ‌రిపింద‌ని.. అన్ని విమానాల‌ను స‌మ‌కూర్చుకునే మౌలిక వ‌స‌తులు వాయుసేన (ఎయిర్ ఫోర్స్ )కు లేదంటూ ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పిన నిర్మ‌ల‌.. తాజాగా మాత్రం కాస్త వెన‌క్కి త‌గ్గారు. తాము 114 విమానాల‌ను మేకిన్ ఇండియాలో భాగంగా త‌యారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో ఆస‌క్తి చూపిన ఏడు కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు.

ర‌క్ష‌ణ అవ‌స‌రాల్ని త‌గ్గించుకునే ఉద్దేశం త‌మ‌కు ఎంత మాత్రం లేద‌న్న నిర్మ‌ల‌.. యుద్ధ విమాన ధ‌ర‌ల్లో ఎందుకు మార్పులు చోటు చేసుకున్నాయి మేడ‌మ్‌. అన్న ప్ర‌శ్న‌కు మాత్రం ఎప్ప‌టిలానే మాట దాటేశారు. యూపీఏ హ‌యాంలోకుదుర్చుకున్న యుద్ధ విమాన ధ‌ర‌కు ప‌లు రెట్లు ఎక్కువ ధ‌ర‌కు మోడీ స‌ర్కారు ఒప్పందం కుదుర్చుకుంద‌న్న మాట ఇప్ప‌టికే భారీగా ప్రారం జ‌ర‌గ‌టం తెలిసిందే.

రాఫెల్ డీల్ లో నాటి ర‌క్ష‌ణ మంత్రిని.. విదేశాంగ కార్య‌ద‌ర్శిని ప‌క్క‌న పెట్టి.. ప్ర‌ధాని మోడీనే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌న్నారు. ప్ర‌ధాని మోడీ దిశానిర్దేశంలో తామంతా పార‌ద‌ర్శ‌కంగా ఉన్న‌ట్లుగా చెప్పారు. నిజ‌మే.. రాఫెల్ డీల్ మొత్తం ఎంత పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగింద‌న్న‌ది ఇప్ప‌టికే దేశ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. ఇప్పుడు కూడా ఇలాంటి మాట‌లు మాట్లాడితే ఎలా నిర్మ‌లాజీ?
Tags:    

Similar News