హోదా కోసం ఏకు మేక‌వుతున్న మోడీ మిత్రుడు

Update: 2018-05-29 13:16 GMT

ప్ర‌త్యేక హోదా అంశం ఏపీలోనే కాదు...బీహార్‌ లోనూ కాక‌పుట్టిస్తోంది. రాష్ట్రం ద‌శాదిశ‌ను మార్చే హోదా కోసం ఏపీలో అన్నివ‌ర్గాల వారు గ‌ళం విప్పుతున్న‌ట్లే...కూట‌మిగా ముందుకు సాగుతున్న బీహార్‌ లోనూ అదే నినాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏ రాష్ర్టానికీ కొత్తగా హోదా ఇవ్వడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ ను పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవ‌ల ఆప్తుడిగా మారిన బీహార్ సీఎం నితీష్‌ కుమార్ ఈ డిమాండ్ కేంద్రంగా ఆయ‌న్ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

నితీష్‌కుమార్ అనూహ్య రీతిలో మూడు రోజుల కిందట నోట్ల రద్దుపై యూటర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. బీహార్‌లో బీజేపీతో మళ్లీ చేతులు కలిపిన తర్వాత నోట్ల రద్దును ఆకాశానికెత్తిన నితీష్..నోట్ల ర‌ద్దు మేలు చేస్తుంద‌ని మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. త‌ద్వారా బీజేపీ శ్రేణుల‌కు షాకిచ్చిన నితీష్ తాజాగా బీహార్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.  15వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన సిఫారసులను కూడా ఆయన ప్రశ్నించారు.2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల పంపిణీ సరైన నిర్ణయమే అయినా.. దీనివల్ల బీహార్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదని, పైగా గతంలో కంటే తక్కువ నిధులు వస్తున్నాయని నితీష్ చెప్పారు. ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తూ బీహార్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2000ను ప్రస్తావించారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షతన ఓ ప్రత్యేక సెల్‌ ను ఏర్పాటు చేసి బీహార్ ప్రత్యేక ఆర్థిక అవసరాలను చూసుకోవాలని ఆ చట్టం స్పష్టంగా చెప్పినట్లు నితీష్ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ ఉండటంతో దాని ఆధ్వర్యంలో అలాంటిదే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తలసరి ఆదాయం, విద్య, ఆరోగ్యం, విద్యుత్‌లాంటి అంశాల్లో జాతీయ సగటు కంటే బీహార్ సగటు చాలా తక్కువగా ఉన్నదని, అందుకే తాము ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
Tags:    

Similar News