పొలిటికల్ మర్డర్ చేద్దామనా అన్న సీఎం!

Update: 2016-11-29 05:39 GMT
ఒక ముఖ్యమంత్రిని ఒక సామాన్యుడు తన మనసులోని సందేహాల్ని నివృతి చేసుకునే వీలుందా? తాను విన్న మాటల్ని.. తాను సేకరించిన సమాచారాన్ని ప్రశ్నల రూపంలో సంధించే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. కానీ.. ఒక జర్నలిస్టుకు ఆ అవకాశం ఉంటుంది. పొద్దున ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడి మధ్యాహ్నం సామాన్యుడితో కబుర్లు చెప్పి.. రాత్రి సగటు జీవిగా ఇంటికి వెళ్లే పాత్రికేయుడు.. మిగిలిన వారితో పోలిస్తే కాస్త భిన్నమనే చెప్పాలి.

పాత్రికేయం పుణ్యమా అని ప్రశ్నించే అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నలు సంధించటం సరి కాదు. కానీ.. దూకుడు రాజకీయాల పుణ్యమా అని.. జర్నలిజంలో కూడా కొన్ని ప్రశ్నలు కాస్తంత దూకుడుగానే వస్తున్న పరిస్థితి. ఇది సరైన పరిణామం కాకున్నా.. తప్పని దుస్థితి. మిగిలిన వారి కంటే ముందుండాలన్న తొందరలో.. తన ప్రశ్నతో ప్రేక్షకుల దృష్టిని తన మీద ఫోకస్ చేసుకునేందుకు వీలుగా కొంతమంది పాత్రికేయులు వేసే ప్రశ్నలకు రాజకీయ నేతలు సైతం బ్యాలెన్స్ మిస్ అవుతున్నారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పెద్దరికపు రాజకీయాలకు నిలువెత్తు రూపంగా కనిపించే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు తాజాగా పాత్రికేయులపై ఆగ్రహం తన్నుకు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని తాను సమర్థించిన వైనానికి తమదైన భాష్యాలు చెప్పుకుంటూ ప్రశ్నించటం.. దీనిపై మరీ ఎక్కువ చేస్తున్న మీడియా తీరుతో తాను ఎంత చిరాగ్గా ఉన్నానన్న విషయాన్ని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పేశారు.

ఐదుగురు జర్నలిస్టులతో కలిసి మాట్లాడే క్రమంలో ఒక జర్నలిస్టు నితీశ్ ను సంధించిన ప్రశ్నకు ఆయనకు సహనం కోల్పోయేలా చేసింది. ఈ మధ్యన మోడీకి బాగా దగ్గరవుతున్నారు. ఎన్డీయేకు మీరు బాహాటంగానే మద్దుతు ఇస్తున్నట్లుగా ఉన్నారు. మిమ్మల్నిబీజేపీ నేతలు సైతం ప్రశంసిస్తున్నారంటూనే ప్రశ్నించిన వైనానికి నితీశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను పనిగట్టుకొని మరీ రాజకీయంగా హత్య చేసేకుట్ర. దీంతో మీకు ఏమొస్తుంది. ఇది జర్నలిజం కాదు. దీన్ని జర్నలిజం అనరు కూడా’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ కాకుండా మరో రాష్ట్రంలోనే ఇలాంటిది జరిగితే.. కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారన్న ఆయన.. తాను మాత్రం అలాంటి వ్యక్తిని కాదని ముక్తాయించారు నితీశ్. ప్రశ్న వేయటం తప్పు కాదు. కానీ.. వేసే ప్రశ్న సందర్భానికి తగ్గట్లు ఉందా? అన్నది చూసుకోకపోతే ఇలాంటి వ్యాఖ్యలే ఎదురవుతాయేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News