మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ... ఈ నెల 16 న ప్రమాణస్వీకారం

Update: 2020-11-13 16:35 GMT
ఉత్కంఠభరితంగా జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. దీనితో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమౌతోంది. గతంలో ప్రధాని మోదీ చెప్పినట్లుగానే జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఈ నెల 16 న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా బీజేపీ అధిక స్థానాల్లో గెలుపొందినప్పటి కీ పొత్తులో భాగంగా నితీష్ నే సీఎం చేయడానికి బీజేపీ ముందుకొచ్చింది. బిహార్‌ లో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న రికార్డు 17 సంవత్సరాల 52 రోజులు శ్రీ కృష్ణ సింగ్ పేరిట ఉన్నది. నితీష్ కుమార్ ఇప్పటివరకు 14 సంవత్సరాలు 82 రోజులు ఈ పదవిలో ఉన్నారు. మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో అందరి కళ్లూ నితీష్‌ కుమార్‌ పైనే ఉన్నాయి.

నితీష్ కుమార్ మొదటిసారి ముఖ్యమంత్రిగా 2000 లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. 2005 లో ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ లభించడంతో నితీష్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. లోక్‌ సభ ఎన్నికల్లో జేడీయూ యొక్క పేలవమైన పనితీరును దృష్టిలో ఉంచుకుని.. 2014 లో నైతిక ప్రాతిపదికన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. అయితే, ఏడాది తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చారు. 2015 లో నితీష్ కుమార్ యొక్క జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఆర్జేడీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేశారు. మెజార్టీ స్థానాలు గెలిచి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై నితీష్‌ కుమార్‌ కూర్చున్నారు. అయితే, మనీలాండరింగ్ కేసులో అప్పటి ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ పేరు రావడంతో ఆయన 2017 లో రాజీనామా చేయాల్సి వచ్చింది. మరుసటి రోజు బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 243 సీట్లలో పోటీ చేసి 125 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసిన మహా కూటమికి 110 సీట్లు వచ్చాయి. ఎన్డీఏలో బీజేపీకి 74 సీట్లు, జేడీయూ 43 సీట్లు వచ్చాయి. బిహార్‌ తదుపరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అని బుధవారం నాడు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నితీష్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి కావల్సిన సాధారణ మెజారిటీ 122 ను ఎన్డీయే సాధించడంతో ముఖ్యమంత్రి సీటు జేడీయూ బీజేపీలకు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో 2000, 2005, 2010, 2015, 2017లో మొత్తం ఐదుసార్లు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తాజాగా ఈ నెల 16 న ప్రమాణస్వీకారం చేశారు.
Tags:    

Similar News