షాక్ః బ్యాంకుల్లోనూ నో క్యాష్ బోర్డులు

Update: 2017-03-14 14:42 GMT
సామాన్యుడు షాక్ తినే వార్త ఇది. ఏటీఎంల్లోనే కాదు బ్యాంకుల్లోనూ నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నోట్ల రద్దు రోజుల్లో కంటే దారుణంగా ఉంది. అప్పడు ఏ అర్థరాత్రో, తెల్లవారుజామునో ఏటీఎంలలో నగదు లభించేది. ఇప్పడు ఏటీఎంలలో నగదు నింపటమే మానేశారు. వంద ఏటీఎంలు తిరిగినా వంద రూపాయలు దొరకట్లేదు. ఎందుకంటే.. ఆర్‌ బీఐ నుంచి బ్యాంకులకు కరెన్సీ సప్లయ్ పూర్తిగా ఆగిపోయిందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.తెలుగు రాష్ర్టాల్లో ఈ పరిస్థితి ఇంకో నెలరోజులు ఉండే అవకాశముందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

నగదు విత్‌ డ్రా చేసుకుంటే చార్జీలు బాదుతుండటంతో చాలా మంది బాంకుల్లో నగదు డిపాజిట్ చేయకుండా ఇంట్లో దాచుకుంటున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు 60 శాతం తగ్గింది. నగదు బ్యాంకులో డిపాజిట్ చేసి అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో జనం తమ వద్ద ఉన్న నగదును ఇంట్లో దాచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బ్యాంకుల్లోనే సొమ్ము లేదు. కాగా, నగదు లేకపోవడంతో ఆగ్రహం చెందిన జనం ఇవాళ హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో రెండు ఏటీఎంలను ధ్వంసం చేశారు.

మ‌రోవైపు కొత్త 2వేల రూపాల‌య నోట్ల ఆధారంగా మోసాలు జ‌రుగుతున్నాయి. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు ఇటీవ‌ల ఢిల్లీలో క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు అలాంటి నోట్లే హైదరాబాద్‌లోనూ దర్శనమిచ్చాయి. యూసుఫ్ షేక్ వ్యక్తి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న రూ.2000 - రూ.500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చి కటకటాల పాలయ్యాడు. స్టేషనరీ షాప్ యజమాని అయిన  యూసుఫ్‌ రూ.9.90 లక్షల విలువ గల చిల్డ్రన్ బ్యాంక్ నోట్లను డిపాజిట్ చేసేందుకు మల్కాజిగిరిలోని అలహాబాద్ బ్యాంకుకు వచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు క్యాషియర్ వెంటనే మేనేజర్‌కు తెలిపాడు. మేనేజర్ కుషాయి గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే అక్కడకు చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు నోట్లకు, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటుకు ఏ మాత్రం తేడాలేదని, గుర్తించడం అసాధ్యమేనని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దొంగ నోట్లలో రూ.2000 నాలుగు వందలు, రూ.500 నోట్లు మూడు వందల వరకు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News