ఇద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్ షిప్ ఏమీ లేదంతే

Update: 2016-05-18 06:25 GMT
బీజేపీ.. తెలుగుదేశం పార్టీల మ‌ధ్య దూరం పెరుగుతుందా? ఏపీ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేసే చంద్ర‌బాబు.. బీజేపీ ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి మ‌రికేమీ లేద‌న్న‌ట్లుగా అడుగులేసే మోడీ వైఖ‌రితో ఇద్ద‌రి మిత్రుల మ‌ధ్య ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి త‌గ్గుతుందా? అంటే అవున‌నే చెప్పాలి. మిత్రులుగా ఒక‌రికి ఒక‌రు అండ‌గా ఉండాల్సిన దానికి భిన్నంగా ఎవ‌రికి వారు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌ద్ధ‌తి. విభ‌జ‌న నేప‌థ్యంలో పుట్టెడు స‌మ‌స్య‌ల‌తో ఉన్న చంద్ర‌బాబు స‌ర్కారుకు కేంద్రం ద‌న్నుగా నిలిస్తే.. ఆయ‌న వీటిని ప‌రిష్క‌రించుకోవ‌టం పెద్ద విష‌య‌మేమీ కాదు. కానీ.. మోడీ అందుకు సిద్ధంగా లేక‌పోవ‌ట‌మే అస‌లు స‌మ‌స్య‌.

ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి బీజేపీ నేత ఒక‌రికి అవ‌కాశం ఇస్తార‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ కు రాజ్య‌స‌భ‌కు పంపేలా బాబు స‌హ‌క‌రిస్తార‌ని.. అందుకు ప్ర‌తిగా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని కేంద్రం ఇస్తుంద‌న్న లెక్క‌లు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే.. తాజాగా  చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో అలాంటిదేమీ ఇరువురి మ‌ధ్య ఉండ‌ద‌ని తేలింది. అంతేకాదు.. ఒక రాజ్య‌స‌భ సీటును త‌మ‌కు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న బీజేపీ నుంచి  లేద‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌మ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లో రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న త‌మ మ‌ధ్య రాలేద‌ని చంద్ర‌బాబు తేల్చేయ‌ట‌మే కాదు.. రెండు పార్టీల మ‌ధ్య అలాంటి స‌ర్దుబాటుకు అవ‌కాశం లేద‌న్న‌ట్లుగా బాబు మాట‌లు ఉండ‌టం చూస్తే.. మిత్రులుగా ఉన్న‌ప్ప‌టికీ.. వారి మ‌ధ్య మిత్ర‌త్వం ఏమీ లేద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News