బుగ్గన సెకండ్ టెర్మ్ : అప్పు పుట్టడం లేదుట... జీతాలు ఎలా సామీ....?

Update: 2022-05-06 11:57 GMT
ఆయన ఏపీకి ఆర్ధిక మంత్రి. అంతకు ముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. రాష్ట్రం లెక్కలు అన్నీ ఆయనకు చాలా బాగా తెలుసు. అందుకే జగన్ సీఎం కాగానే ఆర్ధిక మంత్రిగా ఆయన్నే తీసుకున్నారు. అలా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆర్ధిక మంత్రిగా ప్రమాణం చేసి మూడేళ్ళ పాలన గడిచేసరికి అప్పులు మంత్రిగా విపక్షాల  చేత కొత్త బిరుదుని తగిలించుకున్నారు.

ఆయన అప్పులను ఏదో మార్గంలో తేవడం ద్వారా రాష్ట్రాన్ని మూడేళ్ళ పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెట్టుకొచ్చేలా చేశారు. నిజంగా బుగ్గన నిర్వహించిన పాత్ర అద్భుతం అనే అంటారు. ఆయన లేకపోతే ఏపీలో జగన్ బటన్ నొక్కి నగదు నేరుగా లబ్దిదారులకు అందించే కార్యక్రమం అయితే ఉండేది కాదని కూడా అంటారు. మరో వైపు చూస్తే ఏకంగా లక్షన్నర కోట్ల దాకా నగదు పేదల ఖాతాలో చేరింది. అదే సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించారు, మిగిలిన కార్యక్రమాలకు ఖర్చు చేయగలిగారు అంటే అది బుగ్గన మార్క్ మ్యాజిక్ అనుకోవాలి.

కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గినా బొజ్జల వరసబెట్టి వేసిన ఢిల్లీ టూర్లు అనేక రకాలుగా అప్పులు సేకరించిన విధానంతో వైసీపీ సర్కార్ కడుపులో చల్ల కదలకుండా కధను నడుపుకుంది. మరి వైసీపీలో బుగ్గన ప్లేస్ ఎంత కీలకమో విస్తరణలో ఎవరిని తప్పించినా ఆయన ఉండి తీరాల్సిందే అన్న విధానమే చెబుతుంది.

సరే మొత్తానికి చివరి రెండేళ్ళకూ బుగ్గన ఆర్ధిక మంత్రిగా ఫిక్స్ అయిపోయారు. అంతా బాగానే ఉంది కానీ సెకండ్ టెర్మ్ మంత్రిరికం బుగ్గనకు అసలు కలసిరావడంలేదుట. అప్పు ఎక్కడా పుట్టడంలేదు అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ ఏ పద్ధతులలో అప్పు ఎలా తేవాలో అన్నీ చూసి అప్పు తెచ్చేశారు. ఒక విధంగా అప్పు పుట్టించడం అనే బ్రహ్మ విద్యకు కాలం చెల్లిపోయింది అనుకోవాలి.

అదే టైమ్ లో కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఏపీలో కొండలా పేరుకుపోతున్న అప్పుల మీద మూడవ కన్ను తెరచేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఏపీ అప్పుల చిట్టాను మొత్తని అధికారుల నుంచి సేకరించింది. అన్ని వైపుల నుంచి గట్టిగా బిగించేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద కూడా కేంద్రం గుర్రుగా ఉంది, ఏపీని  దివాళా తీయించేస్తున్నారు అని కేంద్ర పెద్దలు గట్టి నిఘా పెట్టారు అని ప్రచారం సాగుతోంది. దాంతో కేంద్రం కళ్ళు గప్పి అప్పులు తేవడం అసలు కుదరడంలేదుట.

ఈ మొత్తం పరిణామాలతో ఏపీలో ఎప్పటిలాగానే ఈసారి కూడా జీతాలు బాగా లేట్ అయిపోయాయి. కొంతమంది పించనర్లకు  మాత్రమే ఆరవ తారీఖున  ఖాతాలలో పించన్లు వేశారు. ఇక ఉద్యోగుల జీతాలు కూడా ఇప్పటికి అందలేదు అని అంటున్నారు. టోటల్ గా చూస్తే  రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు, పింఛన్లకు 5,400 కోట్ల రూపాయలు  అవసరమని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ 2 వేల కోట్ల రూపాయలు  జీతాలు, పింఛన్ల రూపంలో చెల్లించినట్టు తెలుస్తోంది.

మిగిలిన వాటికి డబ్బులు వెతుకులాట ఉందని అంటున్నారు. అయితే ఈ పరిణామాల పట్ల పెన్షనర్లతో పాటు ఉద్యోగులు కూడా మండుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వాలని, కానీ ఇపుడు చూస్తే ఎపుడు జీతాలు పడతాయో తెలియడం లేదని ఒక్క లెక్కన  ఫైర్ అవుతున్నారు. మొత్తానికి సెకండ్ టెర్మ్ లో బుగ్గన అప్పులు తేవడంతో ఫెయిల్ అవుతున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇలాగైతే జీతాలు జీవితాలు ఎలా సామీ అని సర్కార్ ఉద్యోగి బావురుమంటున్నాడు.
Tags:    

Similar News