2000 నోట్ల ముద్ర‌ణ ర‌ద్దు..అబ్బే అదేం లేదు

Update: 2019-01-04 13:54 GMT
ఆర్బీఐ కొత్త‌గా ముద్రించిన రెండు వేల రూపాయ‌ల నోట్ల‌ను ఉప‌సంహ‌రించే ప్ర‌తిపాద‌న కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌ గా ప‌రిశీలిస్తోంద‌ని వార్త‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే. పన్ను ఎగ‌వేత‌దారులు, న‌ల్ల‌ధ‌నం రూపంలో 2వేల నోట్ల‌ను దాచుకుంటున్నార‌ని, దాని కోస‌మే 2వేల నోటు ముద్ర‌ణ‌ను నిలిపేశార‌ని - ఆ త‌ర్వాత ఆ నోట్ల‌ను మ‌ళ్లీ బ్యాంకులే తీసుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. న‌వంబ‌ర్ 2106లో డిమానిటైజేష‌న్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత కొత్త‌గా 2వేల నోటును రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 18.0 ల‌క్ష‌ల కోట్ల న‌గ‌దు చెలామ‌ణిలో ఉన్న‌ది. దాంట్లో 37 శాతం, అంటే 6.73 ల‌క్ష‌ల కోట్లు 2వేల నోట్ల రూపంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. నోట్ల ముద్ర‌ణ నిలిపివేత‌పై ఆర్బీఐ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు.  అయితే, కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర గార్గ్‌ ఇవాళ స్పందించారు.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత కొత్తగా ప్ర‌వేశ‌పెట్టిన రూ.2వేల నోటుకు సంబంధించి వస్తున్న వార్త‌లు నిజం కాద‌ని కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్ప‌ష్టం చేశారు. కావాల్సిన దాని క‌న్నా ఎక్కువే ప్ర‌భుత్వం వ‌ద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయ‌ని గార్గ్ త‌న ట్వీట్‌లో తెలిపారు. 2వేల నోటు ముద్ర‌ణ‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం కావాల్సినంత నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. 2వేల నోటు ముద్ర‌ణ‌ను ఆపేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న నేరుగా స‌మాధానం ఇవ్వ‌లేదు.

 2018 మార్చి నాటికి రూ.18.03 లక్షల కోట్ల నగదు మార్కెట్లో చలామణిలో ఉంటే అందులో 37 శాతం(రూ.6.73 లక్షల కోట్లు) రూ.2,000 నోట్లు కాగా - 43 శాతం(రూ.7.73 లక్షల కోట్లు) రూ.500 నోట్లు కాగా మిగిలినవన్నీ చిన్న నోట్లే. ఆగస్ట్ 2018లో జారీ చేసిన ఆర్బీఐ వార్షిక నివేదికలో 7.8 కోట్ల రూ.2000 నోట్లను 2017-18 కాలంలో సర్కులేషన్ లోకి చేర్చారు. రిపోర్ట్ ప్రకారం మార్చి 2018లో రూ.2000 నోట్ల సర్కులేషన్ తగ్గింది. మార్చి 2017తో పోలిస్తే మార్చి 2018లో రూ.2000 నోట్ల సర్కులేషన్ లో 13% తగ్గుదల కనిపించింది. మార్చి 2017లో రూ.2000 నోట్లు 50.2% సర్కులేషన్ లో ఉన్నాయి. అదే 2018లో ఇది రూ.37.3%కి తగ్గింది. రూ.2000 నోట్ ను ట్యాక్స్ ఎగ్గొట్టడం, మనీ ల్యాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని అనుమానిస్తున్న కేంద్రం ఈ నోట్ల ప్రింటింగ్ ను ఆపేసిందని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News