ట్రంప్ షాక్‌... భార‌తీయుల‌కు గ్రీన్‌ కార్డులు అంద‌ని ద్రాక్షేనా?

Update: 2019-08-13 10:45 GMT
అమెరికా అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టింది మొద‌లు... ఆంక్ష‌లు విధిస్తూ... వీసా ఆశావ‌హుల‌కు షాకులు ఇస్తున్న డొనాల్డ్ ట్రంప్‌... తాజాగా మ‌రో క‌ల‌క‌లం రేకెత్తించారు. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న తాజా ఉత్త‌ర్వుతో పేద‌ల‌కు అనుహ్య‌మైన షాక్ ఇచ్చారు. గ్రీన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అమెరికన్‌ ప్రభుత్వ పథకాలు, రాయితీలు గత ఏడాది కాలంగా వాడుకొంటూంటే గనక ఈ కార్డు పొందడానికి అర్హులు కాబోరని ప్ర‌భుత్వం త‌ర‌ఫున వెల్ల‌డించారు. ఆఫ్రికా- సెంట్ర‌ల్ అమెరికా- క‌రీబియ‌న్ దీవుల ప్ర‌జ‌ల‌కు ఇది నిజంగా పెద్ద షాక్‌. ఇందులో భార‌తీయులు కూడా పెద్ద సంఖ్య‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

అమెరికాలో శాశ్వ‌త నివాస హోదాకోసం సాధార‌ణంగా వ‌ల‌స ప్ర‌జ‌లు అమెరికా ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే దాన్ని ఆమోదిస్తూ ఇచ్చే అనుమ‌తిని దాన్నే గ్రీన్‌ కార్డు అంటారు. చ‌ట్ట‌ప‌రంగా వీసా ఉన్న వారే ఆ ద‌ర‌ఖాస్తు చేస్తారు. అయితే లీగ‌ల్ వీసా ఉన్నా.. ఇప్పుడు ఆ వ్య‌క్తులు ప్ర‌భుత్వానికి త‌మ ఆర్థిక స్థితిగ‌త‌లను వెల్ల‌డించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలైన ఆహారం- వైద్యం- గృహవసతి వంటి ప్రయోజనాలను వలసదారులు ఉపయోగించుకున్నట్టు తేలితే వాళ్లకు గ్రీన్‌ కార్డు ఇవ్వ‌కూడ‌ద‌ని వైట్‌ హౌజ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. ప్ర‌స్తుతం గ్రీన్ కార్డు ఉన్న‌వాళ్లు కూడా ఎలాంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని పొంద‌కూడ‌దు. మ‌రో 60 రోజుల్లోనే ఈ కొత్త రూల్‌ ను అమ‌లు చేయ‌నున్నారు.

అమెరికాలో చ‌ట్ట‌బ‌ద్ధంగా వీసా ఉండి ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు పొందుతున్న‌వారిలో సుమారు 2.6 కోట్ల మంది వ‌ల‌స ప్ర‌జ‌లు ఉంటార‌ని అక్క‌డి ఏజెన్సీలు అంచ‌నా వేస్తున్నాయి. కొత్త నియ‌మం ప్ర‌కారం వాళ్లంతా త‌మ ఇమ్మిగ్రేష‌న్ స్టాట‌స్‌ ను మ‌రోసారి స‌మీక్షించుకోవాల్సి ఉంటుంది. కాగా, ట్రంప్‌ ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త రూల్‌ ప్రభావం ఎక్కువగా పడేది భారతీయులపైనే. తాజా లెక్కల ప్రకారం 6- 32- 219 మంది భారతీయులు గ్రీన్‌ కార్డుల క్యూలో ఉన్నారు.. హెచ్‌-1బీ- ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలపై ఉంటున్న ఎక్కువమంది తాత్కాలిక నివాసులే. అయితే ట్రంప్‌ నిర్ణయంపై రాజకీయంగా విమర్శలు రేగాయి. పౌర హ‌క్కుల సంఘాలు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని హేయ‌మైన చ‌ర్య‌గా ఆరోపిస్తున్నాయి.

    

Tags:    

Similar News