హోదా అన్న మాట వినిపిస్తే ఫైన్ వేస్తారేమో.

Update: 2017-06-03 06:10 GMT
హ‌క్కు కాస్తా అంట‌రానిదిగా మారింది. ఆ మాట‌కు వ‌స్తే.. శిక్షార్షం కూడా కానుంద‌న్న‌ట్లుగా ప‌రిస్థితి మారుతుందా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌య్యేలా ఉంది. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాను కానుక‌గా ఇస్తున్న‌ట్లుగా నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్ర‌ధాని లాంటి వ్య‌క్తి మాట‌కు ఈ దేశంలో తిరుగు ఉండ‌దు కాబ‌ట్టి.. ఆయ‌న నోటి మాట కూడా శిలా శాస‌న‌మేన‌ని ఫీల‌య్యారు ఆంధ్రోళ్లు.

అయితే.. ప్ర‌ధాని అయినా.. ఇంకెవ‌రైనా స‌రే.. నోటి మాట‌ను అస్స‌లు న‌మ్మొద్ద‌న్న క‌ఠిన నిజాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు.. ఆ మాట‌కు వ‌స్తే ఆంధ్రోళ్ల‌కు చాలా బాగా అర్థ‌మ‌య్యేలా చెప్పారు ప్ర‌ధాని మోడీ.  హోదా ఇవ్వ‌టం అనేది జ‌రిగితే ఏం జ‌రుగుతుంద‌ని ఆలోచించారో ఏమో కానీ.. ఆ ప‌దాన్ని వినేందుకు కూడా మోడీ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ర‌ని చెబుతారు. ప‌వ‌ర్ లోకి రాక‌ముందే.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో హోదా గురించి ప‌దే ప‌దే మాట్లాడి.. ఆంధ్రోళ్ల‌కు కొత్త ఆశ‌ల్ని క‌ల్పించిన మోడీ.. ప‌వ‌ర్లోకి వ‌చ్చాక మాత్రం ఆ ప‌దాన్ని ద‌గ్గ‌ర‌కు రానిచ్చేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు.

తొలుత హోదా అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా వాద‌న‌లు వినిపించి.. దానికి ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌త్యేక ప్యాకేజీని తెర‌పైకి తీసుకొచ్చిన మోడీ స‌ర్కారు.. ద‌శాల వారీగా హోదా డిమాండ్ ను నిర్వీర్యం చేసేలా చేశారు. చివ‌ర‌కు ప‌రిస్థితి ఎంత‌వ‌ర‌కు తెచ్చారంటే.. మోడీతో పెట్టుకుంటే వ‌చ్చే కాసిన్ని నిధులు కూడా రాకుండా పోతాయ‌న్న భ‌యాన్ని నూరిపోసేశారు. అంతేనా.. మోడీలాంటి నేత మాట విన‌కుండా ఆయ‌న‌కు కోపం వ‌స్తే ఇంకేమైనా ఉందా? అన్న‌ట్లుగా కొంద‌రు మాట‌లు చెప్ప‌టం క‌నిపిస్తుంది.

మోడీ మ‌నసును గెలుచుకునే ప‌నిలో భాగంగా ఆయ‌న‌కు న‌చ్చిన‌ట్లే.. హోదాను ప‌క్క‌న పెట్టేసి.. తూతూ మంత్రం ప్యాకేజీని తెర మీద‌కు తీసుకొచ్చారు. ఆంధ్రోళ్ల‌కు న‌చ్చినా న‌చ్చ‌కున్నా.. బాబుకు నచ్చేలా చేసిన మోడీ స‌ర్కారు.. హోదా మీదా బాబు రాజీ ప‌డేలా చేశార‌న్న మాట ఉంది.

మోడీ డిసైడ్ చేసి.. బాబు ఓకే అన్న త‌ర్వాత కూడా హోదా గురించి మ‌ళ్లీ మాట‌లు ఉంటాయా? అని ప‌లువురు అన్నా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటోళ్లు తెర మీద‌కు వ‌చ్చి.. పీకేస్తాం.. పొడిచేస్తామంటూ మూడు స‌భ‌లు పెట్టేసి.. త‌మ‌కిచ్చిన డిమాండ్‌ ను సాధించేంత‌వ‌ర‌కూ నిద్ర‌పోమంటూ మాటలు చెప్పేశారు. అయితే.. మాట‌లు చెప్పినంత ఈజీ కాద‌న్న విష‌యం త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేశాయి.

హోదా అన్న‌ది లేద‌ని.. అస‌లు ఆ మాటే వ‌ద్ద‌న్న‌ట్లుగా మోడీ అండ్ కో చెబుతున్న వేళ‌.. హోదా సాధ‌న కోసం ఏపీని ముక్క‌లు చేసిన కాంగ్రెస్ రంగంలోకి దిగ‌నుంద‌ని చెబుతున్నారు. ఏపీలో రాహుల్ నేతృత్వంలో హోదా సాధ‌న కోసం పెద్ద స‌భ పెట్ట‌ట‌మేకాదు.. ఆంధ్రోళ్ల‌లో కొత్త ఆశ‌లు ర‌గిలించేలా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇలాంటి వేళ‌లో.. హోదా విష‌యంలో మోడీ స‌ర్కారు ఎంత స్ప‌ష్టంగా ఉంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ఒక కీల‌క వ్య‌క్తి చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీకి హోదా అనే ప‌ద‌మే ఉత్ప‌న్నం కాదంటూ నీతి అయోగ్ ఉపాధ్య‌క్షుడు అర‌వింద్ ప‌న‌గ‌డియా తాజాగా వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేక హోదా అంటే కేంద్రం నుంచి ప్ర‌త్యేకంగా నిధులు ఇవ్వ‌ట‌మేన‌న్న ఆయ‌న‌.. ప్ర‌త్యేక హోదా రాష్ట్రాల‌కు గ‌తంలో ప్ర‌ణాళిక సంఘం నిధులు కేటాయించేదని.. ఇప్పుడు నీతి అయోగ్ ఆ ప‌ని చేయ‌టం లేద‌న్నారు. నేరుగా రాష్ట్రాల‌కే నిధులు వెళుతున్న నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా అన్న ప‌దం ఉత్ప‌న్నం కాద‌ని చెప్పారు.

 ప్ర‌స్తుతం దేశంలో మ‌రే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా లేద‌ని ఆయ‌న తేల్చేశారు. ప‌న‌గ‌డియా మాట‌లు వింటే ఏపీ హోదా  సాధ‌న అన్న‌ది లేనే లేద‌ని.. ఒక‌వేళ హోదా అన్న‌ది ఇవ్వాలంటే ఇప్పుడున్న వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా మార్చాల‌న్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. మోడీ తీరుపై కొంద‌రు వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేస్తూ.. రానున్న రోజుల్లో హోదా ప‌దాన్ని నిషిద్ధ మాట‌ల జాబితాలో చేర్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న నిజం కూడా కావొచ్చేమో. ప‌వ‌రా మ‌జాకానా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News