జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే!

Update: 2019-10-25 14:30 GMT
ఐదు నెలల కిందట మోడీ ప్రభుత్వం బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే.. మూడేళ్లలోనే ఎన్నికలు ఉంటాయంటూ ఒక ప్రచారమ మొదలైంది. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ - లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు  నిర్వహించాలని భారతీయజనతా పార్టీ వాళ్లు ముచ్చటపడుతూ వచ్చారు. ప్రత్యేకించి మోడీ-అమిత్ షాలకు ఆ ఆసక్తి చాలా ఉందని స్పష్టం అయ్యింది. అయితే దీంతో అవిగో.. ఇవిగో.. ఎన్నికలంటూ హడావుడి మొదలైంది. ఏపీలో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్లు మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే కొన్నాళ్లుగా అందుకు సంబంధించి హడావుడి లేదు. మోడీ-అమిత్ షా ద్వయం కూడా అందుకు సంబంధించి మంత్రాంగం సాగిస్తున్న దాఖలాలు లేవు. ఆ సంగతలా ఉంటే.. మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తీరును గమనించాకా.. ఇప్పట్లో మోడీ ప్రభుత్వం ఎన్నికలంటూ హడావుడి చేసే అవకాశాలు తగ్గిపోయాయి.

వచ్చే ఐదేళ్ల వరకూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేదు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పలితాలను గమనించాకా.. ప్రజలు గుడ్డిగా బీజేపీకి ఓటేసే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. ప్రతిపక్షానికి కూడా చాన్సులు ఉన్నాయని స్పష్టం అవుతోంది. ప్రజలు ఐదేళ్లకు మోడీకి అధికారం ఇచ్చారు. దాన్ని కాదని.. మూడేళ్లకే మళ్లీ ఎన్నికలంటూ  జనం ముందుకు వెళ్తే.. మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉండవచ్చు.

మొన్నటి వరకూ తమకు తిరుగులేదు అని బీజేపీ వాళ్లు అనుకుని ఉండవచ్చు. ఆ భానవతో జమిలి ఎన్నికలంటూ ఆలోచనలు చేసి ఉండవచ్చు. అయితే.. ప్రజలు తమను తిరస్కరించడానికి ఏ మాత్రం వెనుకాడరనే భావం మహా - హర్యానా ఎన్నికలతో బయటపడింది. కాబట్టి.. జమిలి ఎన్నికల ఊహాగానాలకు కచ్చితంగా తెరపడినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయం గురించి మీడియా అడిగినా.. మాట్లాడవద్దని బీజేపీ అధికార ప్రతినిధులకు అధిష్టానం నుంచి సూచనలు కూడా అందినట్టుగా భోగట్టా!

Tags:    

Similar News