పెళ్లి చేసుకుంటేనే భార్య మ‌తం మారిపోదు

Update: 2017-12-08 05:09 GMT
అన్య మ‌తానికి చెందిన మ‌హిళ హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న‌ప్పుడు.. ఆమె మ‌తం ఉంటుందా? ఉండ‌దా?  పెళ్లి త‌ర్వాత ఆమె ఏ మ‌తానికి చెందిన‌ది అవుతుంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు చ‌ట్టం సూటిగా స‌మాధానం చెప్ప‌ని నేప‌థ్యంలో.. ఈ వ్య‌వ‌హారం దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ముందుకు వెళ్లింది.

ఈ ప్ర‌శ్న‌ల‌కు సుప్రీం తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌తాంత‌ర పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. మ‌హిళ త‌న సొంత మ‌తాన్ని కోల్పోద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. పెళ్లి అనంత‌రం భ‌ర్త మంతంలోకి  భార్య మ‌త‌విశ్వాసాలు క‌లిసి పోతాయ‌ని ఏ చట్టం చెప్ప‌లేద‌ని పేర్కొంది.

హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న పార్సీ మ‌హిళ‌.. వివాహం అనంత‌రం త‌న మ‌తాన్ని కోల్పోతుందా?  లేదా? అన్న కేసు సుప్రీంకోర్టు రాజ్యాంగ  ధ‌ర్మాస‌నం ఎదుట‌కు విచార‌ణ వ‌చ్చింది.  గూల్రోఖ్ అనే పార్సీ మ‌హిళ హిందూ వ్య‌క్తిని పెళ్లాడారు.  హిందూ వ్య‌క్తిని పెళ్లాడిన త‌ర్వాత పార్సీ మ‌హిళ‌కు త‌న మ‌తాన్ని కోల్పోతుంద‌ని.. భ‌ర్త మ‌త విశ్వాసాల‌కు చెందిన వ్య‌క్తి అవుతుందంటూ గుజ‌రాత్ హైకోర్టు 2010లో తీర్పును ఇచ్చింది.

దీన్ని స‌వాలు చేసిన ఆమె సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. మ‌తాంత‌ర వివాహం చేసుకున్న మ‌హిళ.. త‌న సొంత మ‌తాన్ని కోల్పోదంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును ఇంకా ఇవ్వ‌లేదు.
Tags:    

Similar News