బీఆర్ఎస్ ప్లాప్ షో!.. ఢిల్లీలో 2 రోజులుగా ఉన్నా హడావుడి లేదేం కేసీఆర్?

Update: 2022-10-14 12:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నంతనే అదో సంచలనంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తాయి. టీఆర్ఎస్ అధినేతగా.. ఉద్యమనేతగా వ్యవహరించిన వేళలోనూ జాతీయ స్థాయిలో ఆయనకున్న పలుకుబడి అంతంతమాత్రమే. అలాంటి ఆయన మోస్ట్ పవర్ ఫుల్ గా మార్చింది మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయమే. అప్పటివరకు ఆయన్ను పట్టించుకోని వారు సైతం..ఆయన గురించిన విషయాల్ని తెలుసుకోవటం కోసం ఆసక్తిని ప్రదర్శించటం మొదలైంది. దీనికి తోడు ఆయన్ను ఇంద్రుడు.. చంద్రుడు అనేలా పొగిడే సంప్రదాయం మొదలు కావటం.. వ్యవస్థల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఆయన వ్యవహరించే విధానాలు ఆయనకు మరింత ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి.

ఇదే సమయంలో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది ఆయనకు లాభించేదిగా మారటమే తప్పించి.. ఆయనకు ఎదురుదెబ్బ పడేలా చేసిన ఉదంతమే లేదని చెప్పాలి. దీంతో.. ఆయన తిరుగులేని రాజకీయ అధినేతగా మారారు. దీనికి తోడు.. ప్రత్యర్థి పార్టీల్ని ఖతం చేసే కరుకైన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో ఆయన సక్సెస్ కావటం మరింత లాభించింది. 2018లో ముందస్తుకు (అధికారికంగా కాదనుకోండి) వెళ్లాలని డిసైడ్ కావటం.. ఆయన అంచనాలకు తగ్గట్లే చంద్రబాబును బూచిగా చూపించి ఓట్లు దండుకోవటమే కాదు.. రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు.

అలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఎదురులేని పరిస్థితి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సెక్రటేరియట్ కు వెళ్లని ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పాలి. అయినప్పటికీ.. తాను చేసే పనిని సమర్ధించుకోవటమే కాదు.. దాన్ని ప్రజలు సైతం ప్రచారం చేసేలా మార్చుకోవటం ఆయన తెలివికి నిదర్శనంగా చెప్పాలి. ఇలాంటి వేళ.. ప్రధాని నరేంద్ర మోడీను ఢీ కొనేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఏ రంగానికి చెందిన వారైనా సరే.. తాను టార్గెట్ చేసినంతనే వారిని శంకరగిరి మాన్యాలు పట్టించే సత్తా ఉందని బలంగా నమ్మే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. తన పలుకుబడిని జాతీయ స్థాయికి విస్తరించాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చటం.. దాని సాంకేతిక అంశాల్ని త్వరలో పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నారు.

తన పార్టీని జాతీయ పార్టీగా మార్పులు చేసిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీలోకి కేసీఆర్ అడుగు పెడుతున్నారన్నంతనే.. బోలెడంత సంచలనంగా మారుతుందని ఆశించారు. కానీ.. అలాంటిదేమీ లేకుండా పోవటం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న ఆయన.. తొలిరోజు పార్టీ భవనాన్ని నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్లి.. అక్కడి పనులను పర్యవేక్షించారు.

దీని డిజైన్ పై ఆయన రివ్యూ చేపట్టారు. దసరా రోజున పార్టీ పేరు మార్పు అంశం మీద మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకు వీలుగా తన ప్లానింగ్ ఉంటుందని చెప్పారు కేసీఆర్. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయటానికే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. తాను పెడుతున్న బీఆర్ఎస్ తో కలిసి ముందుకు సాగేందుకు దేశ వ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముందుకు వస్తున్నారన్నట్లు అప్పట్లో చెప్పారు.

తన మాటలతో హైప్ క్రియేట్ చేసే కేసీఆర్  బీఆర్ఎస్ ఇష్యూలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఢిల్లీకి వచ్చిన వేళ.. హడావుడిగా ఉండాల్సిన కేసీఆర్..రెండు రోజులుగా పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల్ని పరిశీలించటం.. వాస్తు అంశాల్ని చూడటం.. మ్యాపుల్ని ముందుకు పెట్టుకొని సమీక్ష జరపటం లాంటి వాటికే పరిమితం కావటం గమనార్హం. ఇదంతా చూస్తే.. దేశ రాజకీయాల్ని మలుపు తిప్పుతానని నమ్మకంగా చెబుతున్న కేసీఆర్ మాటలకు భిన్నమైన వాతావరణం ఢిల్లీలో ఉందని చెప్పకతప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News