అనుమతి ఇవ్వలేదు కానీ రూ.లక్ష కోట్లు పంపిణీ చేయాలన్నదే పాల్ ప్లాన్!

Update: 2022-05-04 06:21 GMT
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఆయనకంటూ ఎంత ఓటు బ్యాంక్ ఉందన్న విషయం మీద ఎవరికి ఎలాంటి అనుమానాలు కానీ సందేహాలు కానీ లేవు. అలాంటిది ఎవరి నోటి వెంట రాని విచిత్రమైన వ్యాఖ్య మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. తమకు పోటీ కేఏ పాల్ అంటూ కేటీఆర్ చెప్పిన మాటలు.. ఆయనకు మాత్రం మరోలా అర్థం కావటం.. అప్పటి నుంచి నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో తెలంగాణలో ఆయన చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

ఇటీవల ఆయనపై టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు దాడికి పాల్పడటం.. దానిపై ఆయన తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే.. తాను బిజీగా ఉన్నట్లు చెప్పారని.. ఆయన తీరికగా ఉండే వరకు తాను వెయిట్ చేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు.. తాను ఏపీ.. తెలంగాణలో సభలునిర్వహించి రూ.లక్ష కోట్ల మేర ప్రజలకు పంచాలన్నది తన ఆలోచనగా చెప్పారు.

తెలంగాణలో  టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో తమ సభలకు అనుమతి ఇవ్వటం లేదన్నారు. తాను రాష్ట్రానికి ప్రజాశాంతి పార్టీ అధినేతగా వచ్చానని.. తాను మరోసారి సిరిసిల్లకు వెళతానని.. వెళితే చంపేస్తారా? అరెస్టు చేస్తారో చెప్పాలంటూ సవాలు విసిరారు. తనపై దాడికి కారణమైన టీఆర్ఎస్ కార్యకర్త వెనుక స్థానిక డీఎస్సీ.. సీఐలే దాడి చేయించారన్నారు. తనపై జరిగిన దాడికి చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లేందుకు సైతం పోలీసులు అనుమతించకపోవటం గమనార్హం. ఆయనకు అనుమతి లేదంటూ ఇంట్లోనే ఉంచేశారు.

త్వరలోనే తాను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని.. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆటలు ఇక చెల్లవన్నారు. పంటలు నష్టపోయిన వారికి ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పరిహారాన్ని ఐదు రోజుల్లో ఇవ్వాలని ఒకవేళ కుదరకపోతే.. ఆ పరిహారం అందించటానికి తనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా రైతులకు కేఏ పాల్ వెల్లడించారు.  

పరిహారం ఇచ్చేందుకు అంత ఆసక్తి చూపుతున్న కేఏ పాల్ కు అనుమతి ఇచ్చేస్తే.. ఆయన ముచ్చట కూడా తీర్చినట్లు అవుతుంది కదా? ఈ విషయంలో సీఎం కేసీఆర్ కాస్తంత వేగంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
వచ్చే ఎన్నికల్లో తాను తెలంగాణ నుంచి పోటీ చేస్తానని చెప్పిన పాల్.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. మే 28న సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ పెడతామన్నారు. ఈ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే.. కోర్టుకు వెళతామని చెబుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విచారణలు జరుపుతామన్నారు.

కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు వెళ్లిన పాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయనస్పందిస్తూ.. మళ్లీ సిరిపిల్లకు వెళతానని.. తనను చంపుతారా? అరెస్టు చేస్తారా? దాడి చేస్తారా? దేనికైనా తాను సిద్ధమన్నారు. తనపై జరిగిన దాడి గురించి ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలీలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆటలు సాగవన్న పాల్.. మంత్రి కేటీఆర్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేటీఆర్ నియోజకవర్గంనుంచి పోటీ చేసినా.. గెలుస్తానని చెప్పారు. తాను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తానన్నారు. ఏపీలో తాను పోటీ చేశానన్నది అబద్ధమని.. తాను జస్ట్ నామినేషన్ వేశానని.. తన తల్లికి బాగోలేకపోతే అక్కడే ఉన్నట్లు చెప్పారు. తాను రుణపడి ఉంటే అది దేవుడికి.. మీడియాకు మాత్రమేనని.. ఒక్క రూపాయి ఇవ్వకుండానే మీడియా తనకు ప్రచారం చేస్తుందని.. తన  హృదయంలో  మీడియా ప్రతినిధులు ఉంటారని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News