జగన్ ను నమ్మినోళ్ల కు నో ప్రాబ్లెం... నందమూరి ఫ్యామిలీ కీ పదవి?

Update: 2019-11-05 16:32 GMT
ఏంటేంటీ... టీడీపీ అంటేనే తనదైన శైలి చికాకు వ్యక్తం చేసే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... టీడీపీ వ్యవస్థాపకుడి సతీమణికి పదవి ఇవ్వనున్నారా? అంటే... చంద్రబాబు అత్తగారికి జగన్ పదవి ఇస్తున్నట్లే కదా. ఈ కోణంలో వినడానికి కాస్తంత విడ్డూరంగానే ఉన్నా... వైసీపీ ప్రస్థానం మొదలైన నాటి నుంచి జగన్ వ్యవహార సరళి గానీ, తనను నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వారికి న్యాయం చేసే విషయం గానీ పరిశీలించిన వారికి ఇందులో పెద్దగా ఆశ్యర్యమేమీ కనిపించదు. ఎందుకంటే... పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న సమయంలో జగన్ కు అధికారం అదింది గానీ... ఆ తొమ్మిదిన్నరేళ్ల పాటు విపక్షంలో ఉన్నా, దాదాపుగా అన్ని పార్టీలు తనను టార్గెట్ చేసినా తనను వెన్నంటి నడిచిన వారి పట్ల జగన్ ఆది నుంచి తనదైన శైలి ఆప్యాయతను చూపిస్తుండటమే కాకుండా పార్టీలోనూ, ఇప్పుడు కొత్తగా అదికారం చేతికందిన తర్వాత పదవుల కేటాయింపుల్లోనూ ప్రత్యేక శ్రద్ధనే కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి లక్ష్మీపార్వతి... టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సతీమణి అయినా కూడా ఆమెకు జగన్ ఓ కొత్త పదవి ఇవ్వబోతున్నారు.

లక్ష్మీపార్వతికి పదవి ఇస్తున్న విషయంలో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే... వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలోకి చాలా మంది నేతలు వచ్చి చేరారు. వారిలాగే లక్ష్మీపార్వతి కూడా వైసీపీలోకి చేరిపోయారు. అయితే ఏనాడూ ఆమె పదవులు కోరలేదనే చెప్పాలి. కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమె ఆశించలేదనే చెప్పాలి. పదవులు ఆశించకుండానే... వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీకి చెందిన పలువులు కీలక నేతలను ఓ రేంజిలో ఆటాడేసుకున్న లక్ష్మీపార్వతి... టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు విషయంలో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ వదిలిన కౌంటర్లకైనా చంద్రబాబు రియాక్ట్ అయ్యారేమో గానీ... లక్ష్మీపార్వతి సంధించిన విమర్శలకు మాత్రం చంద్రబాబు నుంచి అసలు స్పందనే కనిపించని పరిస్థితి. మొత్తంగా వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని, ఆ పార్టీ అధినేతను ఇరుకునపెట్టేసిన లక్ష్మీపార్వతి ఏనాడూ వైసీపీలో పదవులను కోరలేదనే చెప్పాలి. అయితే జగన్ తనను నమ్మినవాళ్లు అడిగినా, అడగకున్నా వారిని మరిచిపోయే రకం కాదు కదా.

ఈ క్రమంలోనే లక్ష్మీపార్వతికి ఇప్పుడు ఓ నామినేటెడ్ పదవిని జగన్ కేటాయించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా లక్ష్మీపార్వతికి ఏమాత్రం సంబందం లేని వ్యవహారాలు కాకుండా... రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఏ రంగంలో అయితే ఉన్నారో, ఆమెకు ఏ రంగం మీద అయితే పట్టు ఉందో... ఆ రంగానికి చెందిన కీలక బాథ్యతలను జగన్ ఎంపిక చేసినట్లుగా ఆ వార్తలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా జగన్ పలు కీలక నామినేటెడ్ పదవులను భర్తీ చేసేశారు కదా. మరి లక్ష్మీపార్వతి కోసం ఏ పదవిని ఎంపిక చేశారన్న విషయానికి వస్తే... రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు పదవిని ఆయన లక్ష్మీపార్వతికి ఇవ్వనున్నారట. ఎన్టీఆర్ తో పరిచయానికి ముందు లక్ష్మీపార్వతి సాహిత్యం, కళా రంగాల్లో కొనసాగారు కదా. సాహిత్యం, కళల ఆధారంగానే ఆమెకు ఎన్టీఆర్ తో పరిచయం కావడం, ఆ పరిచయం కాస్తా వివాహ బంధంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కళా, సాంస్కృతిక రంగాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న లక్ష్మీపార్వతికి దానికి సంబంధించిన పదవినే కట్టబెట్టడం ద్వారా... ఆ రంగంలోని వారికి వీలయినంత మేర మేలు సాధ్యమతుందన్నది జగన్ భావనగా తెలుస్తోంది.
Tags:    

Similar News