తొంద‌ర‌ప‌డి మాట జారిన స‌దానంద‌!

Update: 2018-05-15 07:44 GMT
ఎవ‌రికి క్రికెట్ మ్యాచ్ గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. క్రికెట్ మ్యాచ్ లో ఆఖ‌రి బంతి వ‌ర‌కూ ఏ అద్భుత‌మైనా జ‌ర‌గొచ్చు. ఆఖ‌రి బంతి వ‌ర‌కూ గెలుపుకోసం పోరాడాల్సిందే. అలాంటి ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. ఎన్నిక‌లు సైతం ఇంచుమించు క్రికెట్ మ్యాచ్ లాంటిదే.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే.. ట్రెండ్స్ చూసి ఉక్కిరిబిక్కిరి కావ‌టం.. తొంద‌ర‌ప‌డి స్టేట్ మెంట్లు ఇచ్చేయ‌టం ఏ మాత్రం మంచిది కాదు. తుది ఫ‌లితం తేలే వ‌ర‌కూ ఓపిగ్గా ఉంటే బాగుండేది.

ఇప్పుడు న‌డుస్తున్న దూకుడు రాజ‌కీయాల నేప‌థ్యంలో అధిక్య‌తే అంతిమ ఫ‌లితంగా భావించేస్తున్న ప‌రిస్థితి. ఈ కార‌ణంతోనే బీజేపీ 115 స్థానాల్లో అధిక్య‌త‌లోకి వ‌చ్చినంత‌నే క‌మ‌ల‌నాథుల సంబ‌రాలు అంబ‌రాల‌కు దాటాయి. ఫ‌లితాల సంగ‌తి ప‌ట్టించుకోకుండా సంబ‌రాలు చేసుకోవ‌టంలో మునిగిపోయారు.

ఇలాంటి వేళ కొంద‌రు కీల‌క నేత‌లు ఆనందంతో కాస్తంత ఆడంబ‌ర‌పు మాట‌లు మాట్లాడారు. అలాంటి వారిలో బీజేపీ సీనియ‌ర్ నేత స‌దానంద గౌడ స్పందించారు. త‌మ‌కు ఎవ‌రి మద్ద‌తు అవ‌స‌రం లేద‌ని.. 110కి పైగా స్థానాలు సాధించే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉండ‌టంతో పొత్తుతో ప‌ని లేద‌ని.. తామే సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని గౌడ వెల్ల‌డించారు.

అయితే.. ఆయ‌న మాట్లాడే వేళ‌కు.. బీజేపీ దాదాపు 115 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంది. మేజిక్ ఫిగ‌ర్ కు మించి రెండు స్థానాల్లో అధిక్యంలో ఉన్న నేప‌థ్యంలో స‌దానంద కాన్ఫిడెన్స్ తో చెప్పిన మాట‌లు కాసేప‌టికే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ మాట‌లుగా మారాయి. మేజిక్ ఫిగ‌ర్ కు దాదాపు ప‌ది సీట్లు త‌క్కువ‌కు బీజేపీ సీట్లు ఆగిపోయే ప‌రిస్థితి క‌నిపించ‌టంతో.. ఇప్పుడా పార్టీ అధికారంలోకి రావాలంటే క‌చ్ఛితంగా జేడీఎస్ మ‌ద్ద‌తు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లేనిప‌క్షంలో జేడీఎస్ ను చీల్చి అధికారాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ‌రి అవ‌స‌రం మాకు లేద‌న్న బ‌డాయి మాట‌ల‌కు ముందు కాస్తంత ఆలోచించి మాట్లాడితే స‌దానంద లాంటి వారికి బాగుండేది క‌దా? అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.


Tags:    

Similar News