పెట్రో పై పన్నులేదా.? బీజేపీ అభూతహామీలు

Update: 2018-10-14 07:41 GMT
తెలంగాణలో ఎన్నికల సమయమిదీ.. గెలవడం కోసం పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. టీఆర్ఎస్ 1000 పింఛన్ అంటే.. కాంగ్రెస్ 3000 పింఛన్ అంటోంది. ప్రతీ దానికి రెట్టింపు వాగ్ధానాల వాన కురుస్తోంది. ప్రతీ రాజకీయపార్టీ గెలిచేందుకు అలివికాని హామీలిస్తున్నాయి. వాటి అమలు చేయడం సాధ్యమా? కాదా అన్న విషయాలను పక్కనపెట్టి గెలుపుకోసం సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నాయి.

ఇక లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికే కేసీఆర్ కు నాలుగేళ్లు పడితే.. కాంగ్రెస్ తాజాగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం  అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక రుణమాఫీ దెబ్బకు కేసీఆర్ ఈ సారి ఆ పాట పాడకుండా రైతుల రుణాలపై వడ్డీ చెల్లించడంతోపాటు ఇతర ఉచిత పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు.

 కాంగ్రెస్, టీఆర్ఎస్ లో హామీల గొడవ ఇలా ఉంటే.. నాయకులు లేక సతమతమవుతున్న బీజేపీ పరిస్థితి చిత్రవిచిత్రంగా ఉంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్న కమలనాథులు ఆచరణ సాధ్యం కాని హామీలిస్తూ అందరికీ షాకిస్తున్నారు. ఏకంగా తెలంగాణలో అధికారం ఇస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా తీసేస్తామని సంచలన ప్రకటన చేశారు..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రో ధరలపై అస్సలు పన్నులే వేయమని బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్.వీ.ఎస్.ఎస్ ప్రభాకర్ ఓ ప్రముఖ న్యూస్ చానెల్ తో అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై 32శాతం వ్యాట్ ను, డీజిల్ పై 27శాతం వ్యాట్ ను వసూలు చేస్తోంది.

 ‘తెలంగాణలో ప్రస్తుతం వ్యాట్ వసూలు చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తాము పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించాం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గించాలని అన్ని రాష్ట్రాలను కోరారు. మేము ఈ నిర్ణయానికి కట్టుబడి తెలంగాణలో పెట్రో ధరలపై వ్యాట్ పూర్తిగా ఎత్తివేస్తాం’ అని ప్రభాకర్ చెప్పుకొచ్చారు.

అయితే పెట్రో ధరలపై వ్యాట్ ఎత్తివేస్తే రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున బొక్క పడుతుందని విలేకరులు ప్రశ్నించగా.. ప్రభాకర్ బదులిచ్చారు. ‘ఇతర రాష్ట్రాల్లో చౌకధరలకు పెట్రోల్, డీజిల్ దొరుకుతోందని.. ఎందుకు తెలంగాణ ప్రజలు మాత్రమే బాధపడాలనే ఉద్దేశంతోనే పన్ను ఎత్తివేస్తామన్నారు. ఇతర రాబడి వనరులు, పన్నులు, సహజ, అభివృద్ధి వనరుల నుంచి ఈ నష్టాన్ని ఖజానాకు రాబట్టుకొని భర్తీ చేస్తామని.. ఇందుకోసం ప్రత్యామ్మాయ ఆదాయ వనరులను సృష్టించుకుంటామని’ ఆయన బదులిచ్చారు.  అయితే ఖజానాకు బంగారు బాతు లాంటి మద్యం అమ్మకాలను నిషేధించకుండా సాయంత్రం 6 తర్వాత మాత్రం దొరకకుండా చేస్తామని ప్రభాకర్ సెలవిచ్చారు.  వారానికి 5 రోజులు మాత్రమే నడిచేలా చేస్తామని.. ఎక్సైజ్ శాఖను తాము ఆదాయం సంపాదించే శాఖగా చూడలేమని ఆయన వ్యాఖ్యానించారు.

నిజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రధాన ఆదాయ వనరులు మద్యం, పెట్రో అమ్మకాలే.. ఈ రెండింటి మీదే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వీటినే నియంత్రిస్తామంటున్న బీజేపీ హామీ సాధ్యం కాదని విశ్లేషకులు ఖరాఖండీగా చెబుతున్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ ఇస్తున్న హామీలు అమలు అసాధ్యమంటున్నారు. మరి ఈ తప్పుడు హామీలతో అధికారంలోకి రావాలని కలలు గంటున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి..
Tags:    

Similar News