కిమ్ వ‌ల్ల ట్రంప్‌కు నోబెల్..నామినేష‌న్ పూర్తి

Update: 2018-06-15 14:17 GMT
ఔను మీరు స‌రిగ్గానే చ‌దివారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఇంతెత్తున్న ఎగిరిప‌డే...కొరియాదేశ‌మే ఆయ‌న‌కు నోబెల్ బ‌హుమ‌తి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఉత్త‌ర‌కొరియా ర‌థ‌సార‌థి కిమ్ జోంగ్‌ను ఓ దారికి తెచ్చినందుకు ఈ అవార్డు ద‌క్క‌నుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో ట్రంప్ చారిత్రక భేటీ ప్రపంచ శాంతి కోసమేనని భావించిన ఇద్దరు నార్వే ఎంపీలు ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ఆయన పేరును నామినేట్ చేశారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ కోసం.. ఉత్తర కొరియాతో ఒప్పందం చేసుకునేలా ట్రంప్ కృషి చేశారని సదరు ఎంపీలు కొనియాడారు. గ‌తంలో ద‌క్షిణా కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్ సైతం ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాల‌ని కోరారు. కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాల అంశం ట్రంప్ కారణంగానే చల్లబడింది కాబట్టి నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

సింగపూర్‌లో మంగళవారం జరిగిన ట్రంప్-కిమ్ చారిత్రక భేటీ సానుకూల ఫలితాలను రాబట్టింది. సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా, బదులుగా ఆ దేశానికి భద్రతతోపాటు పలు ప్రయోజనాలను అందించేందుకు అమెరికా హామీ ఇచ్చింది. చర్చల తర్వాత ట్రంప్ అమెరికాకు, కిమ్ ఉత్తర కొరియాకు తిరుగు ప్రయాణమయ్యారు. తమ భేటీ నిజమైన ఫలితాలను, ఆశించిన మార్పును తీసుకువస్తుందని పేర్కొంటూ ట్రంప్ తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి వరుస ట్వీట్లు చేశారు. కాగా, శత్రుత్వం తగ్గి అమెరికా, తాము ఎంత సన్నిహితం అవుతున్నామనేదాన్ని బట్టే అణునిరాయుధీకరణ దిశగా చర్యలు ఉంటాయని ఉత్తర కొరియా తెలిపింది. ఈ మేరకు అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనం ప్రసారం చేస్తూ.. శాంతిని, అణునిరాయుధీకరణను సాధించేందుకు అమెరికా, ఉత్తర కొరియా పరస్పర శత్రుపూరిత వైఖరిని విడనాడాల్సిన అవసరముందని అధ్యక్షుడు కిమ్ తెలిపారు. ద్వేషం తగ్గించుకుని ఇరుదేశాలు స్నేహభావంతో కొనసాగడంపైనే అణునిరాయుధీకరణ చర్యలు ఆధారపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు అని తెలిపింది.

ఇలా వ‌రుస ప‌రిణామాలు చోటుచేస‌కున్న క్ర‌మంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. నార్వేకు చెందిన ఎంపీలు క్రిస్టియన్ టైబ్రింగ్ జేడ్, పెర్-విల్లే అముండ్సేన్  ట్రంప్ పేరును నామినేట్ చేశారు. ‘‘దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు, శాంతి, నిరాయుధీకరణ దిశగా ట్రంప్ అత్యంత కీలకమైన చర్యలు తీసుకున్నారు’’ అని అభివర్ణించారు. కాగా మేలో అమెరికాలోని కొందరు రిపబ్లికన్లు కూడా 2019 సంవత్సరానికి గానూ నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరును నామినేట్‌ చేశారు.
Tags:    

Similar News