మోడీ తండ్రెవరో తెలియదు.. కాంగ్రెస్ నేత దిగజారుడు వ్యాఖ్యలు!

Update: 2018-11-25 13:24 GMT
జాతీయ పార్టీ నేత‌ల వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల పోక‌డ పెరుగుతోంది. ఒక‌రిని మించి మ‌రొఎక‌రు అన్నట్లుగా నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి ఉత్తర్‌ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ రాజకీయ వివాదానికి తెరలేపిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల ఇండోర్‌లో జరిగిన ఒక ఎన్నికల సభలో బబ్బర్ మాట్లాడుతూ, ఒకప్పుడు ఆయన (మోడీ) డాలర్‌ తో పోలిస్తే రూపాయి విలువ నాటి ప్రధాని (మన్మోహన్ సింగ్) వయస్సును చేరుకుంటున్నదని చెప్పేవారు. నేడు రూపాయి విలువ ఎంతకు పడిపోయిందంటే.. అది మీ అమ్మగారి వయస్సుకు చేరువైంది అని అన్నారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌మోడీ వయస్సు ఇప్పుడు 97 ఏండ్లు. బబ్బర్ వ్యాఖ్యల పై తీవ్రంగా విరుచుకుపడిన ప్రధాని మీరు నా తల్లి పేరును రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ కు, ఆ పార్టీ నేతలకు తగునా? అని నిలదీశారు.

అయితే, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ పతనమవుతున్న రూపాయి విలువను మోడీ తల్లితో పోల్చిన మరుసటి రోజే మరో కాంగ్రెస్ నేత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అసలు మోదీ తండ్రెవరో తెలియదంటూ కాంగ్రెస్ నేత విలాస్‌రావ్ ముట్టెంవర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రాహుల్‌గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఐదు తరాల వాళ్లు ఎవరో అందరికీ తెలుసని, మోదీ తండ్రి ఎవరో కూడా తెలియదని విలాస్‌రావ్ అన్నారు. రాహుల్ తండ్రి రాజీవ్ అని, ఆయన తల్లి ఇందిరా అని, ఆమె తండ్రి నెహ్రూ అని అందరికీ తెలుసు. కానీ మోదీ తండ్రి ఎవరో ఎవరికైనా తెలుసా అంటూ విలాస్‌రావ్ అనడం వివాదాస్పదమైంది. ఈ కామెంట్స్‌ను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ నేత‌ల అస‌హ‌నానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

కాగా, ఇప్ప‌టికే ప్ర‌ధాని ఘాటు గా స్పందించిన సంగ‌తి తెలిసిందే. తాను కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతో తాను ఎంతో వేదనకు గురయ్యానన్నారు. రాజకీయాల్లో ర అనే అక్షరం గురించి కూడా తెలియని తన తలిని లక్ష్యం గా చేసుకొని వ్యాఖ్యలు చేస్తున్నారని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీపై కూడా ప్రధాని పరోక్ష విమర్శలు చేశారు. `నా ప్రభుత్వం.. ఓ మేడం ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్‌ తో నడిపించేది కాదు. మాకు 125 కోట్ల మంది దేశ ప్రజలు హైకమాండ్‌గా ఉన్నారు` అని చెప్పారు.
Tags:    

Similar News