పెంపుడు కుక్క కరిస్తే.. యజమానికి రూ.10వేలు ఫైన్

Update: 2022-11-14 04:16 GMT
పెంపుడు కుక్కలతో పలు సమస్యలు ఎదురవుతుంటాయి. నిజానికి ఈ సమస్యలన్ని కుక్కలతో కంటే కూడా వాటిని పెంచుకునే యజమానుల మైండ్ సెట్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి మరింత ఎక్కువ కావటమే కాదు.. సంబంధం లేని వారు సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితి. ఇలాంటి తీరుకు చెక్ పెట్టానికి నొయిదా అధికారులు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. పెంపుడు కుక్కల్ని పెంచుకునే వారికి దిమ్మ తిరిగే షాకివ్వటంతో పాటు.. తమ కుక్కల్ని ఇష్టారాజ్యంగా వదిలేయటం కాకుండా.. అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరాన్ని కొత్త నిబంధనలో పేర్కొన్నారు.

దీని ప్రకారం పెంపుడు కుక్క ఎవరినైనా కరిచినా.. దాడి చేసినా.. దాని యజమానికి రూ.10వేలు ఫైన్ విధిస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు.. బాధితుడికి అయ్యే వైద్య చికిత్స మొత్తాన్ని సదరు యజమాని భరించాల్సి ఉంటుందని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ కొత్త రూల్ ను వచ్చే ఏడాది మార్చి ఒకటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. అంతేకాదు.. పెంపుడు జంతువులు ఉన్న వారి కోసం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు.. వాటిల్లో జంతు యజమానులు తాము పెంచుకుంటున్న జంతువుల వివరాల్ని తప్పనిసరిగా నమోదు చేసి.. రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

అందుకే కాదు.. పెంపుడు జంతువుల వివరాల్ని వెల్లడించని వారికి.. రిజిస్ట్రేషన్ చేయించుకోని వారిపైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతేకాదు.. సమయానికి ఇప్పించాల్సిన టీకాల్ని ఇప్పించకున్నా ఫైన్ తప్పదని హెచ్చరిస్తున్నారు.

పెంపుడు జంతువుల్ని పెంచేవారంతా మరింత బాధ్యతతో వ్యవహరించాలన్న విషయాన్ని చేతలతో నొయిడా మహానగర అధికారులు స్పష్టం చేస్తున్నారని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News