ఏపీ ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌!

Update: 2022-07-12 10:30 GMT
ఏపీలో ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌కు కోర్టుల నుంచి మొట్టికాయ‌లు ప‌డుతూనే ఉన్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చ‌నప్ప‌టి నుంచి సీఎస్ నుంచి డీజీపీ వ‌ర‌కు, క‌లెక్ట‌ర్ల నుంచి కింది స్థాయి అధికారుల వ‌ర‌కు ఏపీ హైకోర్టు చేతిలో చీవాట్లు తిన్న‌వారే. ఒక కేసులో అయితే స్వ‌యంగా డీజీపీ హైకోర్టుకు హాజ‌రై రూల్ బుక్ కూడా చ‌ద‌వాల్సి వ‌చ్చిందంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల ముఖ్య కార్య‌ద‌ర్శులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల్లో కొంద‌రికి హైకోర్టులో కోర్టు ధిక్క‌ర‌ణ‌, త‌దిత‌ర కేసుల్లో జ‌రిమానాలు, రెండు నెల‌ల జైలు శిక్ష‌లు కూడా ప‌డ్డాయి. మ‌రికొంత‌మంది కోర్టుకు క్ష‌మాప‌ణ‌లు తెలిపి జరిమానాలు, జైలుశిక్ష నుంచి త‌ప్పించుకున్నారు.

ఇదే కోవ‌లో తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్ధిక శాఖ కార్య‌దర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. విద్యా శాఖ బిల్లుల చెల్లింపు అంశంపై జూలై 12న‌ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ విచారణకు ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ , విద్యాశాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ హాజరయ్యారు. కాగా సత్యనారాయణ గైర్హాజరయ్యారు.

విద్యాశాఖకు చెందిన పనుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని చెల్లించడం లేదని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. గత విచారణ సమయంలో అధికారులు రావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కారణంగా ఆర్థిక శాఖ అధికారులు రావత్, రాజశేఖర్, సురేష్‍కుమార్ కోర్టుకువచ్చారు. అయితే సత్యనారాయణ మాత్రం రాలేదు.  

విద్యాశాఖ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని సీనియర్‌ న్యాయవాది అంబటి సుధాకర్‌ రావు వాదనలు వినిపించారు. గైర్హాజరైన సత్యనారాయణకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

అయితే సత్యనారాయణ ఐఏఎస్ అధికారి కాదు.. ఐఆర్ఏఎస్ అధికారి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యుటేష‌న్ పై ఏపీకి వచ్చి పనిచేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు మొత్తం ఆయనే చూస్తుంటార‌ని చెబుతుంటారు.
Tags:    

Similar News