కిమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ట్రంప్ ఖుషీ

Update: 2018-04-21 07:54 GMT
ప‌లు దేశాల‌కు గ‌త కొద్దికాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల మిస్సైల్‌ తో పాటు అణు పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ముందుకు ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే కొన్ని వారాల్లో తాను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కొరియా దేశాల అణునిరాయుధీకరణ గురించి ఉన్‌తో చర్చిస్తానని, ఒక వేళ చర్చలు ఫలప్రదమయ్యే అవకాశాలు లేకుంటే సమావేశం మధ్యలోనే వెనుకకు వచ్చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. జపాన్ అధ్యక్షుడు షింజో అబేతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. `అణునిరాయుధీకరణ విషయమై ఉత్తరకొరియాపై గరిష్ఠస్థాయిలో ఒత్తిడి తేవాలని అబే, ట్రంప్ అభిప్రాయపడ్డారు.మేము చేసే ఈ ప్రయత్నం సఫలమయ్యే చాన్స్ లేదని అనిపిస్తే, కిమ్ ఉన్‌తో చర్చలకు వెళ్లను. చర్చలు జరిపినా మధ్యలోనే గౌరవప్రదంగా వెనుకకు వస్తాను. వచ్చి నేను చేయదల్చుకున్నది చేస్తాను` అని ట్రంప్ తేల్చిచెప్పారు. శాంతిచర్చలు సఫలమైతే దశాబ్దాల తరబడి దూరంగా ఉంటున్న రెండు కొరియా దేశాల ప్రజలు ఇకపై శాంతిసౌభాగ్యాలతో - భద్రతాభావంతో కలిసి జీవిస్తారని ట్రంప్ అన్నారు. అమెరికా కేంద్ర గూడచార సంస్థ (సీఐఏ) డైరెక్టర్ మైక్ పాంపియో ఉత్తరకొరియాకు వెళ్లి ఆ దేశ నాయకులతో మంతనాలు జరిపి వచ్చిన విషయాన్ని ట్రంప్  ధ్రువీకరించారు

మ‌రోవైపు పొరుగు దేశ‌మైన ద‌క్షిణ‌కొరియా కూడా హిత‌బోధ చేసింది. కొరియా దేశాల ఘర్షణకు ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందం కుదిరే విధంగా ప్రయత్నాలు జరుగాలని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌జే యిన్ అన్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్‌తో వచ్చే శుక్రవారం భేటీ కాబోతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉభయ కొరియా నాయకుల భేటీలో గానీ, ఉత్తరకొరియా- అమెరికా అధ్యక్షుల సదస్సులోగానీ జరిపే చర్చలు అణునిరాయుధీకరణకు దారితీయాలి. ఉత్తరకొరియా అణ్వాయుధాలు విడిచి పెడితేనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుంది అని ఆయన చెప్పారు. అయితే ట్రంప్ హెచ్చ‌రిక‌ల ఫ‌లిత‌మో లేదా మరేదైనా కార‌ణం ఉండ‌వ‌చ్చు కానీ..కిమ్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఏప్రిల్ 21వ తేదీ నుంచి న్యూక్లియర్ పరీక్షలు, ఖండాంతర క్షిపణుల ప్రయోగాలను ఆపేస్తున్నట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కొరియా ద్వీపకల్పంలో ఆర్థిక ప్రగతి, శాంతిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణ‌యంతో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఖుష్ అయ్యారు. కొద్దికాలం క్రితం వ‌ర‌కు తన మొండిత‌నంతో దూకుడుగా వ్య‌వ‌హరించిన కిమ్ ఇటీవ‌లి కాలంలో కాస్త మెత్త‌బ‌డ్డారు. ఇరుగుపొరుగు దేశాల‌తో సంబంధాల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే వచ్చే వారం జరగనున్న సమావేశంలో కింగ్ జాంగ్ తమ పొరుగుదేశం సౌత్ కొరియా నేత మూన్‌తో భేటీకానున్నారు. జూన్‌ లోగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తోనూ ప్రత్యేక శిఖరాగ సమావేశాన్ని కిమ్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కొరియా తీసుకున్న అణు, మిస్సైల్ పరీక్షల నిలిపివేత నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు స్వాగతించారు. నార్త్ కొరియాతో పాటు ప్రపంచానికి ఇది శుభసందేశమన్నారు.
Tags:    

Similar News