నా మొత్తం చరిత్రపై ఎంక్వైరీ చేసుకోండి: ఈటల సవాల్

Update: 2021-05-01 03:41 GMT
బెదిరింపులకు లొంగే మనిషిని కాదని.. తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్ సవాల్ చేశారు. నిన్నటి నుంచి మీడియాలో తనపై భూకబ్జా ఆరోపణలు రావడం.. దానిపై కేసీఆర్ సర్కార్ విచారణకు ఆదేశించడంతో ఈటల తీవ్రంగా స్పందించారు. ఎవరికి భయపడే జాతి తాను కాదని.. అందరి జాతకాలు బయటకు తీస్తానని హెచ్చరించారు.

స్వయంకృషితో ఎదిగిన చరిత్ర నాది అని.. కావాలంటే తన మొత్తం చరిత్ర మీద విచారణ జరుపుకోండని ప్రభుత్వానికి ఈటల సవాల్ చేశారు. ఏమీ లేని నాడే తాను ఏ ప్రలోభాలకు లొంగకుండా కొట్లాడిన అని గుర్తు చేశారు. ఏ పదవి తనకు గొప్ప కాదని.. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఈటల సవాల్ చేశారు.

మెదక్ జిల్లాలో భూకబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా మండపడ్డారు. కొన్ని మీడియా చానెళ్లు కావాలనే తనపై తప్పుడు కథనాలు వేస్తూ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ధర్మం , న్యాయం తాత్కాలికంగా ఒడిదుడుకులకు లోనైనా అంతిమ విజయం న్యాయానిదేనన్నారు. చిల్లర ప్రచారం మానుకోవాలన్నారు.

ఇక మెదక్ జిల్లాలో అసైన్డ్ భూములను రైతులకే తనకు అమ్మారని.. తమ బిడ్డల పెళ్లిళ్ల కోసం ఈ భూములు కొని డబ్బులు ఇవ్వాలని వేడుకుంటే తాను కొని పౌల్ట్రీ ఫాములు పెట్టానని ఈటెల తెలిపారు. దీనిపై సీఎంవో చీఫ్ నర్సింగరావుతో కూడా తాను మాట్లాడి ఓకే అనుకున్నాక పరిశ్రమల శాఖకు, ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకొని కొన్నానని ఈటెల తెలిపారు.
Tags:    

Similar News