కరెంటు కోతలే కాదు.. మాటల వాతలు పడేందుకు సిద్ధం కండి ఏపీ ప్రజలరా

Update: 2022-04-08 23:30 GMT
నిజానికి దేశంలోని మరే రాష్ట్ర ప్రజలకు ఎదురు కాని సమస్యలు.. ఇబ్బందులు.. మాట పడటం లాంటివి ఏపీ ప్రజలకు మాత్రం తరచూ ఎదురవుతూ ఉంటాయి. రాష్ట్ర విభజనతో ఆ సమస్య మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి ఏపీ ప్రజలు సైతం కొందరు మద్దతు పలికారు. ఉద్యమంలో కీలకభూమిక పోషించిన వారు ఉన్నారు. అయితే.. ఉద్యమ వేళలో తమ భాషను.. యాసను.. సంప్రదాయాన్ని.. సంస్క్రతిని అవమానించారంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సరైన వాదనను వినిపించటంలో ఏపీ ప్రాంతానికి చెందిన మేధావులు కానీ బుద్ధ జీవులు కానీ రియాక్టు అయ్యింది లేదు. తాము ఏదైనా మాట్లాడితే.. రాజకీయంగా మరేం అవుతుందోనన్న భయంతో నాటి నాయకత్వం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన రాజకీయ అవసరాలకు తగ్గట్లు విమర్శలు చేయటం కేసీఆర్ కే చెల్లుతుంది.తెలంగాణ ఉద్యమ ప్రాథమిక స్వరూపం గురించి తరచూ మాట్లాడే ఆయన.. ఉద్యమ నినాదంలో కీలకమైన విడిపోయి కలిసి ఉందామనే విషయాన్ని.. విభజన తర్వాత ఒక్కసారైన గులాబీ బాస్ నోటి నుంచి ఎందుకు రాలేదు? సోదరులుగా విడిపోదామని.. అందరూ బాగుండాలని ఉద్యమం వేళ చెప్పిన ఆయన.. విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తూ.. రాజకీయ నేతల్ని.. ఉమ్మడి రాష్ట్ర పాలకుల పేరుతో ఎక్కెసం చేయటం తరచూ చేస్తున్నదే. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటికి ప్రవేశ పెట్టే ప్రతి బడ్జెట్ సందర్భంగా ఉమ్మడి పాలకుల పేరుతో ఏదో ఒక మాట అనటం ఇప్పటికి జరుగుతూనే ఉంది.

ఏపీ పాలకుల పేరుతో తరచూ ఏదో ఒక మాట అనే కేసీఆర్ కారణంగా నొప్పి పడేది రాజకీయ నాయకులకు కాదు. ఏపీ ప్రజలే అన్నది వాస్తవం. తమ తప్పు ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే.. విడిపోయాం.. ఎవరి బతుకు వారు బతుకుదామని అనుకున్న తర్వాత.. కలిసి ఉన్నప్పుడు అలా చేశారు.. ఇలా చేశారన్న మాటలతో అర్థం ఏమైనా ఉంది. ఈ మాటలకు కౌంటర్ గా మాటలు వస్తే.. అది కాస్తా వాదనగా మారుతుందన్నది మర్చిపోకూడదు.

విడిచిపోయిన తర్వాత కూడా ఏపీ గురించి కేసీఆర్ అండ్ కో అనే మాటలకు ఏపీ నేతలు ఎవరూ రియాక్టు కారు. ఎందుకంటే.. వారి విలువైన ఆస్తులన్ని ఉన్నవి హైదరాబాద్ లోనే. నేటికి ఏపీకి చెందిన మంత్రులు (ప్రస్తుతం మాజీలు అనుకోండి), ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు అందరికి హైదరాబాద్ లో ఆస్తులు.. వ్యాపారాలు ఉండటం నిజం కాదా? అంతదాకా ఎందుకు నియోజకవర్గంలో ఉండటం ఎలానో హైదరాబాద్ లో ఉండటం కనిపిస్తుంది. సొంత నియోజకవర్గం.. సొంత రాష్ట్రం కంటే కూడా హైదరాబాద్ తో వారికున్న అనుబంధం.. వ్యాపార అవకాశాల నేపథ్యంలో కేసీఆర్ మాటలకు స్పందించే అవకాశమే లేదు.

వీటన్నింటికి దూరంగా ఏపీలో తమ బతుకులు బతికే ప్రజలు మాత్రం.. తరచూ ఏదో ఒక మాట అనిపించుకున్నామే అన్న వేదనకు గురవుతుంటారు. విభజన ఉద్యమంలో చేసిన వ్యాఖ్యలన్ని ఉద్యమంలో భాగంగా అనుకుంటే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏదో ఒక మాట తరచూ పడాల్సిన పరిస్థితిని ఏమంటారు?అని ప్రశ్నించే గొంతులకు సమాధానం ఇచ్చే వారు కనిపించరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అవుతుందన్న మాటను తరచూ ప్రస్తావించే కేసీఆర్.. తాము విద్యుత్ సమస్యను అధిగమించామని సగర్వంగా చెప్పుకుంటారు.

విద్యుదుత్పత్తి అవకాశం ఉన్నా.. ప్రణాళిక లోపంతో ఇప్పుడు తీవ్ర స్థాయిలో కోతల్ని ఎదుర్కొంటున్న ఏపీ.. ఏపీ ప్రజలు మరికొద్ది రోజుల్లో కేసీఆర్ నోట్లో నానటం ఖాయమని చెప్పక తప్పదు. తమను అవహేళన చేసిన రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు కరెంటు కోతలతో కిందా మీదా పడుతున్నారని.. గంటల కొద్దీ కోతలతో సతమతమవుతున్నారని ఆయన చెప్పటం ఖాయమంటున్నారు. అదే సమయంలో తెలంగాణలోని పరిస్థితిని చెప్పటం ద్వారా.. తెలంగాణ ప్రజల మనసుల్ని దోచుకోవటంతో పాటు.. తమ ప్రభుత్వ విజయంగా చెప్పుకోవటానికి ఈ అంశం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మాట అనిపించుకోవటానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉంటే మంచిది. ప్రస్తుతం పన్ను పీకించుకున్న సీఎం కేసీఆర్.. విశ్రాంతిలో ఉన్నారు.సమయం.. సందర్భం చూసుకొని ప్రెస్ మీట్ పెట్టే ఆయన.. ఏపీ ఎదుర్కొంటున్న కరెంటుకోతల అంశాన్ని ప్రస్తావించి.. రెండు మూడు పంచ్ లు వేయటం ఖాయమని చెప్పకతప్పదు.
Tags:    

Similar News