నోటా వ‌ర్సెస్ ఏక‌గ్రీవం!

Update: 2021-07-26 09:55 GMT
`నోటా`(న‌న్ ఆఫ్ ది ఎబౌ).. ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. ఎన్నిక‌ల స‌మ‌యం లో ఈవీఎం(ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్‌)లో దీనిని ఏర్పాటు చేస్తూ..కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాజీ ఐఏఎస్ అధికారి ఎం.ఎస్‌. గిల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న‌ప్పుడు.. `నోటా`ను ఇంట్ర‌డ్యూస్ చేశారు. అంటే.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో పోటీకి ఎంత మంది అభ్య‌ర్థులు ఎన్ని పార్టీల త‌ర‌ఫున పోటీ చేసినా.. లేదా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగినా.. ప్ర‌జ‌లు.. స‌ద‌రు అభ్య‌ర్థులకు త‌ప్ప‌ద‌ని ఓటు వేసే అవ‌కాశం లేకుండా.. `పైవారెవ‌రూ.. మాకు ఇష్టం లేదు` అనే అభిప్రాయం చెపేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డేలా.. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది.

ఈ నోటాను 2004 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి దేశంలో అమ‌లు చేస్తున్నారు. అంత‌కు ముందు.. ఈవీఎం లో ఉన్న అభ్య‌ర్థుల‌ను ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చ‌క‌పోయినా.. లేక‌.. స‌ద‌రు అభ్య‌ర్థిపై వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. త‌ప్ప‌ని స‌రిప‌రిస్థితిలో ఎవ‌రికో ఒక‌రికి ఓటు వేయాల్సి వ‌చ్చేది. కానీ, నోటా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వా త‌.. దేశంలో దీనికి కూడా ఓట్లు ప‌డుతున్నాయి. అంటే.. ప్ర‌జ‌ల‌కు ఆ ఎన్నిక‌లో పోటీ చేసిన అభ్య‌ర్థులు ఎవ‌రూ కూడా న‌చ్చ‌లేద‌ని అర్ధం. 2004 నుంచి అమ‌ల్లో ఉన్న నోటాకు ఒక్కొక్క‌సారి అభ్య‌ర్థుల క‌న్నా కూడా ఎక్కువ ఓట్లు వ‌చ్చిన సంద‌ర్భం ఉంది.

ఇటీవ‌ల ఏపీలోని తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక జ‌రిగిన‌ప్పుడు.. నోటాకు కూడా 20 వేల పైచిలుకు ఓట్లు ప‌డ్డాయంటే.. ఓట‌ర్లు దీనిని ఎంత‌గా అర్ధం చేసుకున్నారో తెలుస్తుంది. నిజానికి ఓట‌ర్ల‌కు త‌మ స్వేచ్ఛ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం నోటా క‌ల్పించింద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల కాలంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు.. లేదా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను క‌నీసం నామినేష‌న్లు కూడా వేయ‌కుండా.. అడ్డుకుంద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

వీటిపై కోర్టుల్లోనూ కేసులు న‌మోద‌య్యాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో.. అంటే.. ఎవ‌రూ అభ్య‌ర్థులు లేరు. కేవ‌లం ఒకే ఒక్క నామినేష‌న్ దాఖ‌లైంది.. అనే సంద‌ర్భాల్లోనూ నోటాతో ఎన్నిక‌లు జ‌రిపించొచ్చుక‌దా! అనేది మేధావుల మాట‌. అంటే.. ఈవీఎంలో స‌ద‌రు అభ్య‌ర్థి(ఒకే ఒక‌) పేరుతోపాటు.. కింద నోటా ఉంచి.. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయం చెప్పేందుకు.. అంటే.. ఏక‌గ్రీవం అయ్యే అభ్య‌ర్థి.. త‌మ‌కు ఇష్ట‌మో లేదా తెలియ‌జేసే అవ‌కాశం ఉంటుంది క‌దా? అంటున్నారు ప‌రిశీల‌కులు.

దీనివ‌ల్ల ఎన్నిక‌ల్లో పార‌ద‌ర్శ‌కత రావ‌డంతోపాటు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగే అక్ర‌మాల‌కు, నామినేష‌న్లు వేయించ‌కుండానే ఏక‌గ్రీవాలు ప్ర‌క‌టించుకునేవిధానానికి చెక్ పెట్టే అవ‌కాశం ఉంటుంది క‌దా.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఇదే విష‌యంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ‌.. ఏక‌గ్రీవం ప్ర‌క‌టించుకున్న అభ్య‌ర్థి న‌చ్చితే.. ప్ర‌జ‌లంతా(ఓట‌ర్లు) ఆయ‌న‌కే మూకుమ్మ‌డిగా ఓట్లు వేస్తారు. లేక‌పోతే.. స‌ద‌రు అభ్య‌ర్థి మాకు వ‌ద్ద‌ని తీర్పు చెప్పే అవ‌కాశం ప్ర‌జాస్వామ్యంలో క‌ల్పించిన ట్టు అవుతుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News