సుప్రీం హెచ్చ‌రికః అల్ల‌ర్లు జ‌ర‌గొచ్చు

Update: 2016-11-18 12:48 GMT
రూ.500 - రూ.1000 నోట్ల ర‌ద్దు - అనంత‌ర ప‌రిణామాల గురించి భార‌త సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. నోట్ల ర‌ద్దుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన సుప్రీంకోర్టు ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టే వ్యాఖ్య‌లు చేసింది. ఇది చాలా తీవ్ర‌మైన స‌మ‌స్య అని.. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే రోడ్ల‌పై అల్ల‌ర్లు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. నోట్ల ర‌ద్దుపై దాఖ‌లైన పిటిష‌న్‌ పై చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా టీఎస్ ఠాకూర్ వాద‌న‌లు విన్నారు. నోట్ల ర‌ద్దుపై హైకోర్టులు - కింది కోర్టుల్లో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై స్టే విధించాల‌న్న ప్ర‌భుత్వ విన‌తిని ఠాకూర్ తోసిపుచ్చారు. స‌మ‌స్య ఇంత తీవ్రంగా ఉంటే.. త‌మ త‌లుపుల‌ను ఎలా మూసేస్తామంటూ ప్ర‌శ్నించారు.

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు అంశం స‌మ‌స్య తీవ్రంగా ఉన్నందు వ‌ల్లే దేశ‌వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పిటిష‌న్లు దాఖ‌ల‌వుతున్నాయ‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. వాళ్లు ఉప‌శ‌మ‌నం కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అలాంటివారి ఆశ‌ల‌ను వ‌మ్ము చేయ‌లేమ‌ని ఠాకూర్ వ్యాఖ్యానించారు. "ఇది చాలా తీవ్ర‌మైన స‌మ‌స్య‌. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. ప్ర‌జ‌లు దీనివ‌ల్ల ప్ర‌భావితుల‌య్యారు. భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. అల్ల‌ర్లు కూడా జ‌రిగే ప్ర‌మాదం ఉంది" అని సీజేఐ ఠాకూర్‌, జస్టిస్ అనిల్ ద‌వేల‌తో కూడిన ధ‌ర్మాస‌నం స్ప‌ష్టంచేసింది. అయితే అలాంటి భ‌యాన‌క వాతావ‌ర‌ణం ఏమీ లేద‌ని, ప్ర‌జ‌లు చాలా శాంతియుతంగా క్యూల‌లో నిల‌బ‌డుతున్నార‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గీ కోర్టుకు తెలిపారు. కానీ ఆయ‌న వాద‌న‌తో కోర్టు ఏకీభ‌వించ‌లేదు. ప్ర‌జ‌ల‌కు కష్టం క‌లుగుతోందని, దీనిని మీరు విస్మ‌రించ‌కూడ‌ద‌ని ఠాకూర్ అన్నారు. స‌రిప‌డా డ‌బ్బును ప్ర‌భుత్వం ఎందుకు స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించింది. వంద నోట్ల‌కు ఏమైనా కొర‌త ఉందా? వాటినైతే ర‌ద్దు చేయ‌లేదు క‌దా. మరి వాటినైనా అందుబాటులో ఉంచాలి క‌దా అని ఆయ‌న అటార్నీ జ‌న‌ర‌ల్‌ను నిల‌దీశారు. వంద నోట్ల కొర‌త ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం అంగీక‌రించింది.

న‌వంబ‌ర్ 8కి ముందు 80 శాతం 500, 1000 నోట్లే మార్కెట్‌లో ఉన్నాయ‌ని, అందువల్లే వంద నోట్ల కొర‌త ఏర్ప‌డింద‌ని రోహ‌త్గీ చెప్పారు. మ‌రి రోజువారీ ప‌రిమితిని 4500 నుంచి 2000 ఎందుకు త‌గ్గించార‌ని ఠాకూర్ ప్ర‌శ్నించారు. ఎక్కువ మందికి నోట్ల మార్పిడి అవ‌కాశం క‌ల్పించేందుకే ఈ చ‌ర్య తీసుకున్నామ‌ని, పెళ్లిళ్లు చేసుకొనేవారికి, రైతుల‌కు వెసులుబాటు క‌ల్పించామ‌ని రోహ‌త్గీ కోర్టుకు తెలిపారు. దేశంలో 80 కోట్ల మంది జీతం ప‌ది వేల‌లోపే అని...అది బ్లాక్ మ‌నీ కాద‌ని ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది, కాంగ్రెస్ నేత‌ క‌పిల్ సిబ‌ల్ వాదించారు. 23 ల‌క్ష‌ల కోట్ల నోట్ల‌ను ప్రింట్ చేయాల్సి ఉంద‌ని, 14 ల‌క్ష‌ల కోట్ల క‌రెన్సీని ర‌ద్దు చేయ‌డంతో ప్ర‌స్తుతం 9 ల‌క్ష‌ల కోట్ల క‌రెన్సీ మాత్రమే దేశంలో ఉంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా కోర్టులో సిబ‌ల్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని రోహ‌త్గీ ఆరోపించారు. న‌వంబ‌ర్ 25లోగా క్షేత్రస్థాయిలో ఉన్న ప‌రిస్థితుల‌ను కోర్టు ముందు ఉంచాల‌ని పిటిష‌న‌ర్‌, ప్ర‌భుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News