మీడియాతో దోవల్ ఎందుకు మాట్లాడినట్లు?

Update: 2019-09-08 05:00 GMT
అజిత్ దోవల్. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు. ప్రధాని మోడీతో నేరుగా సంబందాలు నెరపటమే కాదు.. ఆయన మిషన్స్ ను ఆయన కోరుకున్నట్లుగా పూర్తి చేసే వారిలో ఆయన కీలకభూమిక పోషిస్తుంటారు. అలాంటి దోవల్ సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు. ఆయన్ను కలిసే ప్రయత్నం చేసినా.. ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించే దోవల్ ప్రస్తుతం జాతీయ భద్రతా సలహదారుగా ఉన్న విషయం తెలిసిందే.

మీడియాకు వీలైనంతవరకూ దూరంగా ఉండే ఆయన.. తన తీరుకు భిన్నంగా మీడియాను పిలిపించి మరీ ప్రెస్ మీట్ పేరుతో ముచ్చటించటం గమనార్హం. ఈ ముచ్చట్లకు మీడియా సమావేశం అన్న పేరు పెట్టేయటం గమనార్హం. ఇంతకీ మీడియాతో దోవల్ ఎందుకు మాట్లాడినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ దుర్మార్గాల్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉండటం.. అందుకు మీడియాకు మించిన మాధ్యమం లేకపోవటంతో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్పాలి.

ఇక.. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా దోవల్ ప్రస్తావించిన అంశాల్నిచూస్తే.. కశ్మీర్ ప్రజల్ని కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. భారత వ్యతిరేక ప్రచారంతో కశ్మీర్ లో అలజడుల్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ లో ఆంక్షల్ని ఎత్తి వేయటం పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందని చెప్పటం ద్వారా.. దాయాది దుర్మార్గాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు.

దేశంలోకి చొరబడేందుకు 230 మంది ఉగ్రవాదులు పాక్ అక్రమిత కశ్మీర్ లో సిద్ధంగా ఉన్నారని.. సరిహద్దుల్లో ఇబ్బందులు కల్పించేందుకు వీలుగా వారు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వ్యాపారుల్ని.. స్థానిక ప్రజల కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నట్లు చెప్పిన దోవల్.. కశ్మీర్ నుంచి యాపిల్ ట్రక్కులు సజావుగా ఎలా ప్రయాణిస్తున్నాయని.. వాటిని అడ్డుకోవాలని సందేశాలు పంపుతున్నట్లుగా చెప్పారు.

యాపిల్ ట్రక్కుల్ని అడ్డుకుంటారా లేదా గాజులు పంపమంటారా అని రెచ్చగొడుతున్నట్లుగా దోవల్ చెప్పారు. పాక్ ఎన్ని కుట్రలుచేసినా అడ్డుకోవటానికి తమ సైన్యం సిద్ధంగా ఉందన్న ఆయన.. జమ్ముకశ్మీర్ లోని మూడు ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ సేవల్ని పూర్తిగా పునరుద్దరించినట్లుగా వెల్లడించారు.


Tags:    

Similar News