ఎన్టీఆర్‌.. చంద్రబాబు.. జగన్‌!

Update: 2015-03-20 13:30 GMT
నందమూరి తారక రామారావు.. నారా చంద్రబాబు నాయుడు.. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి! ఈ ముగ్గురూ ఒకే కోవలోకి వస్తారు. ఏ విషయంలో అంటారా!? అసెంబ్లీ నుంచి బాయ్‌కాట్‌ చేయడంలో. ఇప్పుడు జగన్‌ అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేస్తే.. గతంలో ఎన్టీఆర్‌, చంద్రబాబులు మాత్రమే ఒక్కోసారి అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు కానీ మరెవరూ ఈ సాహసానికి పాల్పడలేదు.

1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. అప్పట్లో ఎన్టీరామారావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి వరకు అప్రతిహతంగా అధికారం చలాయించిన ఎన్టీఆర్‌ ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారనే ఆసక్తి కూడా ఉండేది. అయితే, అధికారపక్షం అప్పట్లో ఎన్టీ రామారావును శాసనసభలో అవమానాలకు, వేధింపులకు గురి చేసింది. ఎన్టీఆర్‌కు అసలే ఆత్మాభిమానం ఎక్కువ. దాంతో ఆ అవమానాలను ఆయన తట్టుకోలేకపోయారు. అత్యంత గౌరవంగా ఈ శాసనసభను నేను బహిష్కరిస్తున్నాను అని ప్రకటించి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి వరకూ ఐదేళ్లపాటు ఎన్టీఆర్‌ పరోక్షంలో సభా నాయకుడిగా చంద్రబాబు నాయుడే వ్యవహరించారు.

చంద్రబాబు నాయుడు 1994 నుంచి 2004 వరకు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తర్వాత 2004 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటే, ముఖ్యమంత్రి స్థానంలోకి వైఎస్‌ రాజశేఖర రెడ్డి వచ్చారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌, కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబును తీవ్ర అవమానాలకు గురి చేసేవారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నిటినీ అపహాస్యం చేసేవారు. ఒక సందర్భంలో అయితే, ''చంద్రబాబూ.. కడిగేస్తానివాళ నిన్ను. నీ అమ్మ కడుపులోంచి బయటకు ఎందుకు వచ్చానా అని నువ్వు చింతిస్తావు'' అని వైఎస్‌ వ్యాఖ్యానించారు. ఎన్ని అవమానాలను తట్టుకున్నా చంద్రబాబు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయారు. అప్పుడే అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించారు. అయితే, అప్పట్లో మూడు రోజులపాటు ఆయన అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారు.

వైఎస్‌ దుర్మరణం తర్వాత ముఖ్యమంతి పదవి జగన్‌కు రాలేదు. సరికదా.. లక్ష కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారంటూ అపకీర్తి మూటగట్టుకున్నారు. సీబీఐ కేసులు వెంటాడుతున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతారనుకుంటే ఆ ఆశలు అడియాశలయ్యాయి. ఆయన ప్రతిపక్ష నేత స్థానంతో సరిపెట్టుకుంటే, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు వైఎస్‌ అవమానాలకు ప్రతీకారం తీర్చుకునే, జగన్‌ను వేధించే అవకాశం చంద్రబాబుకు వచ్చింది. అందుకే, గత ఎనిమిది మాసాలుగా అసెంబ్లీ జరిగిన ప్రతిసారీ ఎజెండా ఏమీ లేకుండా కేవలం జగన్‌ను అవమానించడం, వేధించడమే ఎజెండాగా అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. యనమల, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి కాల్వ శ్రీనివాసులు, ధూళిపాళ్ల , పీతల సుజాత తదితరులను ఇందుకు ప్రత్యేకంగా ఎంపిక చేశారు. జగన్‌ మాట్లాడిన ప్రతిసారీ ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడమే వీరి విధిగా ఉంటూ వస్తోంది. అధికార పక్షం వేధింపులను, అవమానాలను తట్టుకోలేక జగన్‌ కూడా అసెంబ్లీ బాయ్‌కాట్‌కు నిర్ణయం తీసుకున్నారు. అయితే, స్పీకర్‌పై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే వరకూ మాత్రమే అంటూ షరతు విధించారు.
Tags:    

Similar News