చంద్ర‌బాబు, లోకేష్‌ను భ‌య‌పెట్టిన ఎన్టీఆర్ ?

Update: 2021-03-13 17:30 GMT
ఏపీలో టీడీపీ ప‌రిస్థితి ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నారా లోకేష్ నాయ‌క‌త్వంపై పార్టీ నేత‌ల‌కే న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఇప్ప‌టికే పార్టీ కార్య‌క‌ర్త‌ల్లోనూ... అటు నాయ‌కుల్లోనూ జూనియ‌ర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ బ‌తికి బ‌ట్ట‌క‌డుతుంద‌ని అంత‌ర్గ‌త చర్చ‌ల్లో ఒప్పుకుంటున్నారు. పార్టీ నేత‌లంతా లోకేష్‌తోనే ఉంటున్నా వారెవ్వ‌రికి లోకేష్ టీడీపీని న‌డిపిస్తాడంటే న‌మ్మ‌కం లేదు. ఇక ఎన్టీఆర్ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి వినిపిస్తోన్న డిమాండే. ఇటీవ‌ల చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌లో కూడా పార్టీ నేత‌లు... అది కూడా బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వాళ్లు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని బాబు స‌మ‌క్షంలోనే నినాదాలు చేశారు.

ఎన్టీఆర్ వ్యాఖ్య‌ల‌పై బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేసినా పైకి క‌న‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. రెండో రోజు మాత్రం ఈ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా పార్టీ కోసం లోకేష్ వ‌స్తాడు... నేను వ‌స్తాను... మీకు అండ‌గా ఉంటాం అని క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టే బాబు ఎన్టీఆర్‌కు ప‌గ్గాలు ఇచ్చేందుకు లేదా ఆయ‌న‌కు పార్టీలో కీ రోల్ ఇచ్చేందుకు ఎంత మాత్రం ఇష్టంతో లేన‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. తాజాగా ఎన్టీఆర్ ఓ రియాలిటీ షో వ్యాఖ్య‌త‌గా వ‌స్తోన్న క్ర‌మంలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా విలేకర్లు పొలిటిక‌ల్ ఎంట్రీ ఎప్పుడు అని ప్ర‌శ్నించిన‌ప్పుడు ఎన్టీఆర్ విలేక‌ర్ల నుంచే స‌మాధానం కోరారు.

కొంద‌రు జ‌ర్న‌లిస్టులు పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇది స‌రైన సంద‌ర్భం కాద‌ని చెప్ప‌గా... ఎన్టీఆర్ వెంట‌నే రూటు మార్చి త‌ర్వాత తీరిగ్గా వేడి వేడి కాఫీ తాగుతూ క‌బుర్లు చెప్పుకుందామ‌న్నారు. ఈ ఒక్క డైలాగ్ చంద్ర‌బాబు, లోకేష్‌ను భ‌య‌పెట్టేలా ఉంద‌న్న చ‌ర్చ‌లు అప్పుడే సోష‌ల్ మీడియాలో.. ముఖ్యంగా నంద‌మూరి అభిమానుల్లో మొద‌ల‌య్యాయి. నంద‌మూరి ఫ్యామిలీని త‌న అవ‌స‌రాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వాడుకోవ‌డం వారి అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు. 2009లో గెలుపుకోసం ఆ ఫ్యామిలీని తెర‌మీద‌కు తెచ్చిన బాబు త‌న మేన‌కోడ‌లు కుమార్తెతో ఎన్టీఆర్‌కు పెళ్లి చేశాక వారిని వ‌దిలేశాడు.

2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌ను వాడుకున్నారు. హ‌రికృష్ణ సానుభూతి ప‌వ‌నాలు వాడుకునేందుకు ఆయ‌న కుమార్తెను తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయించారు. వీటితో విసిగిపోయిన నంద‌మూరి అభిమానులు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప‌దే ప‌దే కోరుతున్నారు. ఇక ఎన్టీఆర్‌కు రాజ‌కీయాలు ఇష్టంలేదన్న వార్త‌ల‌కు చెక్ పెడుతూ న‌ర్మ‌గర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అటు నంద‌మూరి అభిమానుల్లో జోష్ నింపితే... ఇటు బాబు, లోకేష్ వ‌ర్గంలో గుబులు రేపుతున్నాయి.
Tags:    

Similar News