మరో జంటను కలిపిన జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీం కోర్టులో అరుదైన కేసు!

Update: 2021-08-05 07:36 GMT
ఎలాంటి సమస్యనైనా తీర్చొచ్చు గాని, భార్యాభర్తల మధ్య గొడవలు మాత్రం పరిష్కరించడం సాధ్యం కాదని పెద్దలు అంటుంటారు. అయితే, అలాంటివి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిరూపించారు. ఏకంగా సుప్రీం కోర్టులోనే భార్యాభర్తల సమస్యకు పరిష్కారం చూపించి, ఇద్దరినీ ఒక్కటి చేశారు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం పీఠాన్ని తెలుగు వ్య‌క్తి జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ‌ అధిష్టించిన సంద‌ర్భంగా సుప్రీం కోర్టు చ‌రిత్ర‌లో కొన్ని రోజుల ముందు ఒక అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. సీజేఐ నేతృత్వంలో చాలా ఏళ్ల త‌ర్వాత సుప్రీంకోర్టులో తెలుగులో న్యాయ విచార‌ణ జ‌రిగింది. సాధార‌ణంగా సుప్రీం కోర్టులో వాదనలు ఎక్కువగా జాతీయ బాష హిందీలోనే కొనసాగుతాయి. లేదా ఇంగ్లీష్‌లో వాదనలు ఉంటాయి. అయితే సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దారుకు అనుగుణంగా చీఫ్ జస్టిస్ జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ‌ సూచనతో తెలుగులోనే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. తెలుగులో విచార‌ణ చేప‌ట్టి, భార్యాభర్తల సమస్యకు పరిష్కారం చూపించారు. విడిపోతున్న ఆ ఇద్దరినీ ఒక్కటి చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన కళ్లెం శ్రీనివాసశర్మ దంపతులను దాదాపు 20 ఏళ్ల తర్వాత కలిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ , తాజాగా మరో జంటను తన మధ్యవర్తిత్వంతో కలిపేశారు. ఈ మధ్య కాలంలో తరచుగా మధ్యవర్తిత్వాన్ని ప్రజల్లో, న్యాయవ్యవస్ధలో ప్రచారం చేస్తున్న ఎన్వీ రమణ, దాన్ని ముందుగా తానే ఆచరణలో పెట్టి చూపుతున్నారు. ఇదే క్రమంలో సుప్రీంకోర్టు వరకూ వచ్చిన మరో జంటకు భారీ ఊరట లభించింది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే .. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వ్యక్తి, జార్ఘండ్ లోని రాంచీకి చెందిన యువతి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారి కుటుంబంలో కలహాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొన్ని రోజులు గా విడిగా ఉంటున్నారు.

తన భర్త వేధిస్తున్నాడని భార్య కేసు పెట్టగా, పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇందులో భార్యపై విడాకులు సహా పలు సెక్షన్లతో కేసులు వేశారు. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ మానవత్వంతో పరిశీలించారు. మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. పూణేలో ఉన్న భర్త, రాంచీలో ఉన్న భార్యతోనూ వీడియోకాల్ ద్వారా సీజేఐ ఎన్వీ రమణతో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా హిందీలో మాట్లాడారు వీరిద్దరూ ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నారు. సంభాషణలో భర్త వద్దకు వెళ్లడం తనకు ఇష్టమేనని భార్య సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చెప్పింది. దీనితో వారు భార్యపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని భర్తకు సూచించారు. రెండు వారాల్లోగా ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు భార్యను తన వెంట తీసుకెళ్లాలని వారు ఆదేశించారు.

ఈ ప్రతిపాదనకు భర్త కూడా అంగీకరించారు. అయితే సుప్రీంకోర్టు ఆయనకు మరో షరతు కూడా పెట్టింది. కొన్ని రోజులు మీ ప్రవర్తన పరిశీలిస్తామని, కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీచేసింది. మన దేశ న్యాయవ్యవస్ధలో కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్న సివిల్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేలా దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టే స్వయంగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టుకు ఇలాంటి సివిల్ కేసులు భారీగా వస్తున్నట్లు సమాచారం. దిగువ స్ధాయి కోర్టులు కూడా దీనిపై దృష్టిపెడితే మధ్యవర్తిత్వం ద్వారా చాలా మటుకు సివిల్ వివాదాలు, భార్యాభర్తల తగాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.



Tags:    

Similar News