ఒకేసారి ఎన్నిక‌లు..ఈసీ మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌

Update: 2017-10-08 14:18 GMT
జ‌మిలీ ఎన్నిక‌ల‌కు ప్ర‌ణాళిక బ‌ద్ద‌మైన క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఒకేసారి లోక్‌ సభ - అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. అయితే దాని కంటే ముందు పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. ``ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలకు ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. దీనివల్ల ప్రభుత్వాలు తమ అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించే వీలుంటుంది. ఎన్నికల కోడ్‌ లాంటివి అడ్డు రావు`` అని రావత్ అన్నారు. అయితే ఇది జరగాలంటే రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అవి పూర్తయిన తర్వాత ఆరు నెలలకు ఎన్నికల సంఘం జమిలీ ఎన్నికలు నిర్వహిస్తుందని రావత్ తెలిపారు.

తెలంగాణతోపాటు ఏపీ - ఒడిశా ఎన్నికలు 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించాల్సి ఉంది. జమిలీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘానికి సుమారు 48 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్ మెషిన్లు అవసరం అవుతాయని రావత్ చెప్పారు. ఇప్పటికే ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ కూడా జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కనీసం 2024 నుంచైనా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి అటు నీతి ఆయోగ్ కూడా సానుకూలంగా ఉంది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో ఏకతాటిపైకి రావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

కాగా, జ‌మిలీ, ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి రావ‌డం అంత ఈజీ కాదంటున్నారు. ఎందుకంటే ఈ ప్ర‌క్రియ కోసం అన్ని రాజకీయ పార్టీలను ఏకాభిప్రాయానికి తీసుకురావాల్సి ఉంటుంది. కొన్ని చట్టపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయని ఎన్నికల నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే వచ్చే ఏడాదిలోగా చిక్కులన్నింటినీక్లియర్ చేయాలని కేంద్రం భావిస్తోంది.  ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే పెద్ద ఎత్తున ఈవీఎంలు, పేపర్ ట్రయల్ మిషన్లు అవసరం ఉంటుంది. దీంతో ముందస్తుగానే ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ర్గాలు వాటిని సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ లోగా 40 లక్షల పేపర్ ట్రయల్ మిషన్లు సిద్ధం కానున్నాయి.
Tags:    

Similar News