గుజ‌రాత్‌ లో మోడీ ఓడిపోతే వీళ్ల‌వ‌ళ్ల‌నే

Update: 2017-12-06 06:07 GMT
ఔను వ‌యోవృద్ధులే...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర  మోడీ ఓట‌మికి కార‌ణ‌మ‌వుతార‌ట‌. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇలాకా అయిన గుజ‌రాత్‌ లో ఈ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం ఓట్ల తేడా పార్టీల తలరాతలు మారుస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఆ ఐదు శాతం ఓట్లపైనే రెండు పార్టీలు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు 40 శాతం - బీజేపీకి 49 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ పొందిన ఓట్ల నుంచి ఒక ఐదు శాతం తమవైపు తిప్పుకోగలిగతే అధికారం తమదేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ దృష్టితోనే కుల నాయకులైన హార్దిక్ పటేల్ - అల్పేశ్ ఠాకూర్ - జిగ్నేశ్ మేవానిలతో చేతులు కలిపింది. ఈ సమీకరణల నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ ది పైచేయిగానే కనిపిస్తున్నదని అయితే పాటిదార్లు - ఓబీసీలు అందరూ మూకుమ్మడిగా ఆ పార్టీకి ఓటు వేస్తారనుకోవడం అత్యాశే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గుజరాత్‌ లో వరుసగా ఐదోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అంత సులభం కాదని తెలుస్తోంది. మూడు నెలల క్రితం వరకూ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో బీజేపీకి ఎదురేలేదని భావించిన పరిశీలకులు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. నోట్ల రద్దు - జీఎస్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి శరాఘాతంగా మారవచ్చని అంటున్నారు. తాజాగా విడుదలైన ఓ అభిప్రాయ సేకరణ ప్రకారం గుజరాత్‌లో బీజేపీకి కాంగ్రెస్‌ కు మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్టు వెల్లడైంది. లోక్‌నీతి-సీఎస్‌ డీఎస్ నిర్వహించిన సర్వే ప్రకారం - రెండు పార్టీలకూ సమానంగా 43 శాతం ఓట్లు లభించనుండగా - బీజేపీ 91 నుంచి 99 సీట్ల వరకు గెలుచుకోవచ్చు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 78 నుంచి 86 వరకు సీట్లు లభించవచ్చని ఆ సర్వే తెలిపింది. ఇదే సంస్థ ఆగస్టులో నిర్వహించిన సర్వేకు - తాజా సర్వేకు మధ్య 30 పాయింట్ల తేడా ఉన్నట్టు వెల్లడైంది. మూడు నెలల క్రితం బీజేపీ 150 సీట్లు దాటవచ్చని - కాంగ్రెస్ 30 స్థానాలు గెలుచుకొనేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందని ఆ సర్వే తెలిపింది. ఎన్నికల ప్రచారం జోరందుకుంటున్న నేపథ్యంలో ఓటర్ల వైఖరిలో మార్పు ప్రారంభమైనట్టు తెలుస్తున్నదని పేర్కొంది.

కాంగ్రెస్ గుజరాత్‌లోని ఉత్తర - దక్షిణ భాగాల్లో ఆధిపత్యం చూపుతుండగా - సౌరాష్ట్రలో బీజేపీతో సమానస్థాయిలో ఉంది. ఇక పట్టణ ప్రాంతాల ఓటర్లు బీజేపీ వైపు - గ్రామీణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఈ ఎన్నికల్లో కూడా కొనసాగుతోందని ఆ సర్వే తెలిపింది. వయస్సుల వారీగా చూసినప్పుడు - 18 నుంచి 29 ఏళ్ల‌ మధ్య ఉన్న వారు బీజేపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. 30-39 --- 40-59 ఏండ్ల మధ్య ఉన్నవారు కొద్దిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. వయోవృద్ధులు సమానంగా రెండు పార్టీల వైపు ఉన్నారు. గ‌తంలో ఈ ఓట్లు గంప‌గుత్త‌గా బీజేపీకి ప‌డేవి. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వారిలో అత్యధికులు అచ్చే దిన్ రాలేదని అంగీకరిస్తున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఓటువేసిన వారిలో 54 శాతం మంది ఇప్పుడు తమ వైఖరిని మార్చుకున్నట్టు ఆ సర్వే వెల్లడించింది.

మ‌రోవైపు ఆగస్టులో కాంగ్రెస్‌ కు లభించనున్న ఓట్ల శాతం 29 ఉండగా, అది నవంబర్ చివరి నాటికి 43 శాతానికి పెరిగింది. ఆగస్టులో ప్రధాని మోడీ ప్రజాదరణ శాతం 82 ఉండగా - అది ఇప్పుడు 64 శాతానికి పడిపోయింది. ఇదే కాలంలో రాహుల్ పాపులారిటీ 40 నుంచి 48 శాతానికి పెరగడం విశేషం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కులాలు కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెటుకొనే అధికార బీజేపీ - ప్రతిపక్ష కాంగ్రెస్‌ లు టికెట్లు పంపిణీ చేశాయి. రెండు పార్టీలు పాటీదార్లు - ఓబీసీలకు గరిష్ఠంగా టికెట్లు ఇచ్చాయి. బీజేపీ 50 మంది పాటిదార్లను బరిలోకి దించగా - కాంగ్రెస్ 41 మందికి టికెట్లు ఇచ్చింది. అలాగే బీజేపీ 58 మంది ఓబీసీలను పోటీకి నిలుపగా - కాంగ్రెస్ 62 మందిని బరిలోకి దించింది. ఇక దళితులకు కాంగ్రెస్ 14 టికెట్లు ఇవ్వగా, బీజేపీ 13 మందిని పోటీకి నిలిపింది.
Tags:    

Similar News