అయ్యప్ప ఆలయంలోకి మరో మహిళ.. ఈసారి మారువేషం

Update: 2019-01-10 15:47 GMT
మొన్నటికిమొన్న నిషేధిత వయసు (10 నుంచి 50 ఏళ్లు) కలిగిన ఇద్దరు మహిళలు అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించారు. స్వామి మాల వేసుకున్నట్టు కలరింగ్ ఇచ్చి, మఫ్టీలో పోలీసుల్ని రక్షణగా పెట్టుకొని రహస్యంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఇప్పుడు మరో మహిళ కూడా అదే పనిచేసింది. ఈసారి ఈమె మరింత పకడ్బందీగా ఆలయంలోకి వెళ్లిపోయింది.

త్రిసూర్ కు చెందిన ఈమె పేరు మంజు. వయసు 36 సంవత్సరాలు. అంటే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి అర్హత లేదన్నమాట. అయినప్పటికీ పోలీసుల సహకారం లేకుండా ఆమె దర్శనం చేసుకుంది. దీని కోసం ఆమె మారువేషం మార్గాన్ని ఎంచుకుంది. 50 ఏళ్లు దాటిన వృద్ధమహిళగా మేకప్ వేసుకుంది మంజు. తలకు తెల్లటి రంగు రాసుకుంది. నల్లటి ముతక చీర కట్టుకుంది. వయసుమళ్లిన వాళ్లు పెట్టుకునే అద్దాలు పెట్టుకుంది. అచ్చంగా 55 ఏళ్ల వృద్ధమహిళగా తయారైంది.
ఇంకేముంది.. 50 దాటితే ప్రవేశం అధికారికం కదా. ఎంచక్కా ఆలయంలోకి వెళ్లిపోయింది. దర్శనం చేసుకుంది. పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 2 గంటలు గడిపింది. ఆ తర్వాత తన ఫేస్ బుక్ కు పనిచెప్పింది. తన ఒరిజినల్ ఫొటోతో పాటు శబరిమలలో వేసుకున్న వృద్ధమహిళ గెటప్ ను బయటపెట్టింది. అలా పోలీసుల సహకారం లేకుండానే ఆలయంలోకి ఎంటరైంది మంజు.

మంజు చేసిన పనితో అయ్యప్ప భక్తి సంఘాలు భగ్గుమంటున్నాయి. మరోసారి ఆలయ సంప్రోక్షణకు సిద్ధమౌతున్నాయి. గతంలో ఇద్దరు మహిళలు ఆలయంలో ప్రవేశించినప్పుడు 2 గంటల పాటు మూసేసి శుభ్రంగా సంప్రోక్షణ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే పని చేయబోతున్నారు. అయితే మంజు వ్యవహారంతో భక్తి సంఘాలకు ఓ కొత్త చిక్కొచ్చి పడింది. ఇలా మారువేషంలో వచ్చే నిషేధిత వయసు కలిగిన మహిళల్ని గుర్తించడం ఎలాగో అర్థంకాక వాళ్లంతా తలపట్టుక్కూర్చున్నారు.





Full View
Tags:    

Similar News