కర్ణాటకలో కొత్త ప్రభుత్వం.. వారం రోజులు గడువు!

Update: 2019-07-26 07:12 GMT
కర్ణాటకలో మరో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికన్నా ముందు ఉన్న చర్చ ఏమిటంటే.. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? అనేది.

యడ్యూరప్ప కర్ణాటకకు  మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కొన్ని నెలల్లోనే ఆయన రెండో సారి కర్ణాటకకు సీఎం కాబోతూ ఉండటం గమనార్హం. అప్పుడు కేవలం రెండు రోజులు మాత్రమే సీఎం హోదాలో ఉన్నారు యడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతానికి అయితే బలనిరూపణకు వారం రోజుల గడువు ఇచ్చారు గవర్నర్. వారం రోజుల్లో అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని యడ్యూరప్పకు గవర్నర్ గడువు విధించారు.

అసెంబ్లీలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ అయితే లేదు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 224 వారిలో స్పీకర్, అనర్హత వేటు పడ్డ ముగ్గురు ఎమ్మెల్యేలు పోనూ రెండు వందల ఇరవై మంది ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారు.  ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 111.

అయితే బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం నూటా ఐదు మాత్రమే. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఎలా బలనిరూపణ చేసుకుంటున్నారు? ఫిరాయింపు ఎమ్మెల్యేల బలంతో బయటపడతారా? అలా బయట పడితే వారిపై అనర్హత వేటు పడదా?  గవర్నర్ బీజేపీకి అనుకూలమే అయినా కోర్టులు చూస్తూ ఊరికే ఉంటాయా? మినిమం మెజారిటీ లేకుండా యడ్యూరప్ప ప్రభుత్వం ఎన్నాళ్లు మనగలుగుతుంది? అనేవి శేష ప్రశ్నలు!
Tags:    

Similar News