భర్తను ఎంచుకునే స్వేచ్ఛ 5 శాతం మహిళలకే

Update: 2017-02-14 17:30 GMT
సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేసే భార‌త‌దేశం గురించి ఆస‌క్తిక‌ర‌మైన స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. భారతదేశంలోని మహిళల్లో కాబోయే భర్తను ఎంచుకునే స్వేచ్ఛ కేవలం ఐదు శాతం మందికే ఉంది. పైగా ఈ శాతం 2004-05లో ఏమేరకు ఉందో 2011-12లో దాదాపుగా అంతే ఉండటం గమనార్హం. భారతీయ మహిళలకు తమ జీవితంలోని విభిన్న పార్శాలపై ఏమేరకు నిర్ణయాధికారం ఉంది? అనే అంశంపై జరిపిన ఇండియన్ హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే (ఐహెచ్‌ డీఎస్)లో ఇలాంటి విస్మయం కలిగించే విషయాలెన్నో వెలుగుచూశాయి. 2005లో 5 శాతం మంది మహిళలు భర్త ఎంపికపై తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పగా 2012లో వారి శాతం 4.99 వరకు ఉండటం పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని సూచిస్తోంది. ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాల్సిన మహిళల శాతం 74.2 శాతం ఉండగా అది 79.8 శాతానికి పెరిగింది. 34 భారతీయ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 15-81 ఏళ్ల‌ వయసు కలిగిన 34,000 మంది పట్టణ, గ్రామీణ మహిళలను ఈ సర్వేలో ప్రశ్నించారు. 73 శాతం మంది మహిళలు భర్తను కుటుంబసభ్యులు, బంధువులు ఎంపిక చేస్తారని చెప్పగా 5 శాతం మంది మాత్రమే భర్త ఎంపికపై తమకే పూర్తి నియంత్రణ ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ సహకారంతో భారత జాతీయ అప్లయిడ్ ఎకనామిక్ రిసెర్చ్ కౌన్సిల్ ఈ సర్వే నిర్వహించింది.

మహిళల నిర్ణయాల్లో స్వేచ్ఛ లేకపోవడం అనేది చివరకు సరుకుల దుకాణానికి వెళ్లడం, ఆరోగ్య కేంద్రానికి వెళ్లడం వంటి చిన్నచిన్న విషయాలకూ విస్తరించడం గమనార్హం. దాదాపు 80 శాతం మంది ఆస్ప‌త్రికి వెళ్లాలంటే భర్త అనుమతి లేదా ఇంటిలోని ఇతర పెద్దల అనుమతి తీసుకోవడం తప్పనిసరని చెప్పారు. కిరాణా షాపులో సరుకులు కొనేందుకు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిందేనని 58 శాతం మంది (2012) చెప్పారు. 2005లో వీరి సంఖ్య 44.8 శాతం వరకు ఉండేది. శ్రామికశక్తిలో 27 శాతం  ది మాత్రమే మహిళలు. దక్షిణాసియాలో పాకిస్థాన్ తర్వాత రెండో అతితక్కువ మహిళా శ్రామికుల సంఖ్య మనదేశంలోనే ఉందని ఇండియాస్పెండ్ 2016 నివేదిక తెలిపింది. అయితే ఒక్క వంట విషయంలో మాత్రం మహిళలకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉన్నది. కాగా, భర్త ఎంపికలో మహిళల స్వేచ్ఛ అనేది ప్రాంతాలను బట్టి మారుతున్నది. ఈశాన్య, దక్షిణాది రాష్ర్టాల్లో ఇది అధికంగా ఉండగా ఉత్తరాదిలో అతి తక్కువగా ఉంది. మణిపూర్ లాంటి ఈశాన్య రాష్ర్టాల్లో భర్తను ఎంచుకునే స్వేచ్ఛ మహిళలకు సంపూర్ణంగా ఉంది.

ఉత్తరాదిలో 1-2 శాతం మంది మహిళలు మాత్రమే తమ భర్తను తామే ఎంచుకుంటారు. 65 శాతం మంది మహిళలు కాబోయే భర్తను పెళ్లిపీటల మీదనే తొలిసారిగా చూస్తారు. ఉదాహరణకు బీహార్‌లో 94 శాతం మంది మహిళలు భర్తను పెళ్లిలోనే తొలిసారిగా చూస్తారు. అదే మణిపూర్‌లో 96 శాతం మంది భర్త ఎంపికలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు. దాదాపు వంద శాతం మంది భర్తను పెళ్లికి ముందే చూస్తారు. మిజోరం (88 శాతం), మేఘాలయ (76.9 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్‌లో కనిష్ఠంగా 0.98 శాతం మంది మాత్రమే తమ భర్తను స్వయంగా ఎంచుకుంటారు. పంజాబ్ (1.14), బీహార్ (1.19) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భర్త ఎంపికలో అక్షరాస్యత అధికంగా ఉంటే అధిక స్వేచ్ఛ ఉంటుందనే హామీ ఏదీ లేదు. ఉదాహరణకు అక్షరాస్యత 86.21 శాతం ఉన్న ఢిల్లీలో భర్తను ఎం పిక చేసుకునే మహిళల శాతం 2.09 శాతం మాత్రమే ఉండగా అక్షరాస్యతలో చాలా వెనుకబడ్డ మేఘాలయ లో 76.9 శాతం మంది తామే భర్తను ఎంపిక చేసుకోగలుగుతున్నారు. అక్షరాస్యత కన్నా సాంస్కృతిక వాతావరణం ఈ విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని సామాజికవేత్తలు అంటున్నారు.

మహిళలకు లైంగిక స్వయం నిర్ణయాధికారం ఇచ్చేందుకు నిరాకరించే పితృస్వామిక వ్యవస్థ అడ్డంకిగా నిలుస్తున్నది. ఇదే భారతీయ మహిళలకు అతిపెద్ద సమస్య అని అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి కవితా కృష్ణన్ అన్నారు. అక్షరాస్యత ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఈ సమస్యను ప్రభుత్వాలు నేరుగా ఢీకొనాలి అని ఆమె అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News