రాష్ట్రప‌తి ఎన్నిక‌కు ఓన్లీ క్యాషేన‌ట‌!

Update: 2017-06-19 04:41 GMT
డీమానిటైజేష‌న్... న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎక్కుపెట్టిన పాశుప‌తాస్త్రం. అప్ప‌టిదాకా పెద్ద నోట్ల రూపంలో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు బ‌డా బాబుల ఇళ్ల‌ల్లో - నేల మాళిగ‌ల్లో మూలుగుతోంది. దీనిని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకే మోదీ డీమానిటైజేష‌న్ అను అస్త్రాన్ని బ‌య‌టకు తీశారు. ఈ అస్త్రం దెబ్బ‌కు న‌ల్ల కుబేరులంతా బ‌య‌ట‌కొచ్చేశారు గానీ... వారిని ప‌ట్టుకునేందుకు ప్ర‌భుత్వం అంత‌గా ఆసక్తి చూప‌లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... మొద‌టి సారే వారందరినీ ప‌ట్టేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భావించిందో? ఏమో తెలియ‌దు గానీ... న‌ల్ల డ‌బ్బంతా బ్యాంకులకు వ‌చ్చి చేరేంత‌దాకా వారిని ట‌చ్ కూడా చేయ‌లేదు. ఆ త‌ర్వాత వెయ్యి, రూ.500 నోట్ల‌ను స్థానంలో రూ.2 వేలు, రూ.500 నోట్ల‌ను తీసుకువ‌చ్చిన మోదీ స‌ర్కారు... డిజిట‌ల్ చెల్లింపుల‌పై దృష్టి సారించింది. అవ‌స‌ర‌మైతే త‌ప్పించి... నోట్ల‌ను వాడొద్ద‌ని, వీల‌యినంత‌మేర‌కు డిజిట‌ల్ విధానంలోనే చెల్లింపులు జ‌ర‌పాల‌ని దేశ ప్ర‌జ‌ల‌కు సూచించింది.

ఇలా డిజిట‌ల్ చెల్లింపుల‌ను ఎక్కువ చేసిన వారిలో నుంచి లాట‌రీ తీసి కోటి రూపాయ‌ల బ‌హుమానాన్ని కూడా అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వినియోగ‌దారుల‌కే కాకుండా వ్యాపార‌స్తుల‌కు కూడా ఈ దిశ‌గా ప్రోత్సాహం అందించేందుకు ప్ర‌భుత్వం మ‌రో కోటి రూపాయ‌ల బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. డీజీధ‌న్ పేరిట ప్ర‌వేశ‌పెట్టిన ఈ బ‌హుమ‌తి ఇప్ప‌టికే ఓ ప‌ర్యాయం ప్ర‌క‌టించారు కూడా. అయిఏ డిజిట‌ల్ చెల్లింపులు చేయాల‌ని చెప్పే ప్ర‌భుత్వం... తాను కూడా ఆ దిశ‌గా ప‌య‌నించాలి క‌దా. ప‌య‌నించాలి కాదండి బాబూ... ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిల‌వాలి. మ‌రి ఈ విష‌యంలో మోదీ స‌ర్కారు పాస‌య్యిందా? అంటే పాస్ మార్కులు కాదు క‌దా... సున్నా మార్కులు తెచ్చుకుంద‌నే చెప్పాలి.

అదేంటీ... డిజిట‌ల్ చెల్లింపులే మార్గమ‌న్న మోదీ స‌ర్కారు ఆ దిశ‌గా ప‌య‌నించ‌డం లేదా? అంటే... లేద‌ని చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చాలు. ఆ ఉదాహ‌ర‌ణ విష‌యానికి వ‌స్తే... రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఇటీవ‌లే నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్‌ కు స్పందించిన ప‌లువురు వ్య‌క్తులు రాష్ట్ర‌ప‌తి బ‌రిలో తాము కూడా నిలుస్తామంటూ నామినేష‌న్ ప‌త్రాలు తీసుకుని రిట‌ర్నింగ్ అధికారి వ‌ద్దకెళ్లేందుకు ప‌య‌న‌మ‌య్యారు. బ‌య‌లుదేర‌డానికి కాస్తంత ముందుగా వారు నోటిఫికేష‌న్‌ లోని వివ‌రాల‌ను - నిబంధ‌న‌ల‌ను చ‌దువుకుని జేబులో ఉన్న క్రెడిట్‌ - డెబిట్ కార్డుల‌ను ఇంటి వ‌ద్దే ప‌డేసి... జేబులో నోట్ల క‌ట్ట‌ల‌ను వేసుకుని బ‌య‌లుదేరారు. అదేంటంటే... రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు సంబంధించిన నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ధ‌రావ‌తు సొమ్ముగా ఒక్కో అభ్య‌ర్థి రూ.15 వేలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తాము డిజిట‌ల్ చెల్లింపుల ద్వారా స్వీక‌రించ‌లేమ‌ని చెప్పిన ఎన్నిక‌ల సంఘం... రూ.15 వేల‌ను నోట్ల రూపంలోనే అంద‌జేయాల‌ని తెలిపింది.

అంతేకాదండోయ్... నామినేష‌న్ ప‌త్రాలు స్వీక‌రించే రిట‌ర్నింగ్ అధికారి వ‌ద్ద... అభ్య‌ర్థులు అంద‌జేసే నోట్ల క‌ట్ట‌ల‌ను లెక్క‌పెట్టుకునేందుకు ఓ గుమ‌స్తా కూడా సిద్ధంగా ఉన్నార‌ట‌. ఇదేం ఖ‌ర్మ‌... అంద‌రూ డిజిట‌ల్ చెల్లింపుల బాట ప‌ట్టాల‌ని కేంద్రం ఓ వైపు చెబుతుంటే... దేశ ప్ర‌థ‌మ పౌరుడి ఎన్నిక‌కు సంబంధించిన నామినేష‌న్ డిపాజిట్ కోసం నోట్ల‌నే తీసుకుంటారంటూ అభ్య‌ర్థులు నెత్తీ నోరూ బాదుకున్నారు. అయినా నామినేష‌న్ వేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. బీరువాల్లో ఇంటి ఖ‌ర్చుల కోసం దాచి ఉంచిన నోట్ల క‌ట్ట‌ల‌ను అభ్య‌ర్థులు తీసుకుని వెళ్లార‌ట‌. ఎతావ‌తా చెప్పొచ్చేమంటే... డిజిట‌ల్ చెల్లింపుల బాట ప‌ట్టాల‌ని మోదీ స‌ర్కారు చెబుతుంటే... అదే స‌ర్కారు పాల‌న‌లో జ‌రిగే అత్యున్న‌త స్థాయి ఎన్నిక నామినేష‌న్ కు డిజిట‌ల్ గా కాకుండా నోట్ల‌ను తీసుకుర‌మ్మంటే... మోదీ ఆశ‌యం ఫెయిల‌యిన‌ట్టేగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News