బీజేపీకి ఆపరేషన్ కమల రివర్స్ - కాంగ్రెస్ చేతికి మణిపూర్?

Update: 2020-06-18 03:45 GMT
మణిపూర్‌లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆపరేషన్ కమల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమలం పార్టీకి మూడేళ్ల తర్వాత రివర్స్ అయింది. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికార పార్టీ నుండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఇందులో బీజేపీకి చెందిన ముగ్గురు కూడా ఉన్నారు. వీరితో పాటు ఎన్‌పీపీకి (నేషనల్ పీపుల్స్ పార్టీ) చెందిన నలుగురు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన ఒక ఎమ్మెల్యే, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో చేరారు.

రాజీనామా చేసిన వారిలో డిప్యూటీ సీఎం జైకుమార్ సింగ్ సహా నలుగురు మంత్రులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు (శుక్రవారం) ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. 60 మంది సంఖ్యాబలం కలిగిన మణిపూర్ అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 28, బీజేపీ 21 స్థానాల్లో గెలిచింది. ఎన్‌పీపీ,  స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా ఇబ్బంది లేదని బీజేపీ చెబుతోంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది.

ఇంతకుముందు పలువురు ఎమ్మెల్యేల పై ఇంతకుముందు అనర్హత వేటు పడింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు పడవచ్చు. తద్వారా సంఖ్యా బలం 49కి చేరుకుంటుందని, ఇది తమకు లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది. మరోవైపు, బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినందున తాము ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ బలంగా చెబుతోంది.
Tags:    

Similar News