రివర్స్ సీన్: స‌భ పొడిగింపున‌కు విప‌క్షాలు నో!

Update: 2019-07-19 05:19 GMT
ఇలాంటి సీన్ మీరెప్పుడైనా చూశారా?  అస‌లు ఇలాంటివి మీరెప్పుడూ విని ఉండ‌రు. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అసెంబ్లీ.. పార్ల‌మెంటు స‌మావేశాల్ని నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. మ‌రిన్ని అంశాల్ని చ‌ర్చించేందుకు వీలుగా స‌మావేశాల్ని మ‌రింత‌కాలం పొడిగించాలంటూ విప‌క్షాలు డిమాండ్ చేస్తుంటాయి. అందుకు.. జ‌రిగిన స‌మావేశాలు చాలు కానీ.. పొడిగించే అవ‌కాశం లేద‌ని తేల్చేస్తుంటాయి.

తాజాగా అందుకు భిన్న‌మైన సీన్ ఇప్పుడు ఒక‌టి ఆవిష్కృత‌మైంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్ని పొడిగిస్తామ‌ని అధికార‌ప‌క్ష‌మే ప్ర‌పోజ‌ల్ పెడితే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం రోటీన్ కు భిన్నంగా నో అంటే నో చెప్పేస్తున్నాయి. ఈ స‌మావేశాల్ని షెడ్యూల్ లో భాగంగా ముగించాల‌ని కోరుతున్నాయి. ఇలాంటి సిత్ర‌మైన సీన్ ఇప్ప‌టివ‌ర‌కూ చోటు చేసుకోలేదేమో.

ఎందుకిలా?  స‌భను నిర్వ‌హించే రోజులు పెంచుతామ‌ని అంటే.. విప‌క్షాలు నో చెప్ప‌టానికి కార‌ణం లేక‌పోలేదు. మోడీ స‌ర్కారు త‌మ ఎజెండాలో భాగంగా అమ‌లు చేయాల‌నుకుంటున్న ఆధార్... ట్రిపుల్ త‌లాక్.. జాతీయ మెడిక‌ల్ కౌన్సిల్.. జ‌మ్ముక‌శ్మీర్ లో రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించిన అంశాల‌ను ఈసారి స‌మావేశాల్లో ఆమోదించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది. విప‌క్షాలు మాత్రం అందుకు భిన్నంగా ఈ బిల్లులు స‌భ‌లోకి రాకూడ‌ద‌ని భావిస్తున్నాయి.

దీంతో.. పార్ల‌మెంటు స‌మావేశాల్ని షెడ్యూల్ లో భాగంగా ముగించాల‌ని కోరుకుంటున్నాయి. మామూలుగా అయితే.. ఈ నెల 26 వ‌ర‌కు స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉంది. ఆ వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వం అనుకున్న రీతిలో బిల్లుల్ని స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌టం.. ఆమోదించుకోవ‌టం సాధ్యం కాదు. అందుకే.. స‌భ‌ను మ‌రికొన్ని రోజులు పొడిగించ‌టం ద్వారా బిల్లుల్ని స‌భ‌లో పెట్టేసి పాస్ చేయించుకొని.. చ‌ట్టాలుగా తీసుకురావాల‌ని మోడీ స‌ర్కారు తొంద‌ర‌ప‌డుతోంది.

దీనికి భిన్నంగా విప‌క్షాలు మాత్రం నో చెబుతున్నాయి. మోడీ దూకుడుకు క‌ళ్లెం వేయాలంటే ఈ స‌మావేశాల్లో బీజేపీ ఎజెండాకు చెందిన బిల్లులు రాకూడ‌ద‌ని భావిస్తున్న విపక్షాలు.. త‌మ తీరుకు భిన్నంగా స‌భ త్వ‌ర‌గా పూర్తికావాల‌ని భావించ‌టం విశేషంగా చెప్పాలి.
Tags:    

Similar News