ఆ స్టార్ అమెరికా అధ్య‌క్షురాలు అవుతుందట‌

Update: 2017-03-02 16:15 GMT
అమెరికా అధ్య‌క్షుడి ఎన్నిక‌లు ముగిసి కేవ‌లం రెండు నెల‌లు కూడా కాకముందే 2020లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొత్త అధ్య‌క్షుడు ట్రంప్ త‌మ‌కు స‌రైన నాయ‌కుడు కాద‌ని అమెరికాలోని ప‌లువురు నిర‌స‌న తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ క్ర‌మంలో కొత్త ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. టీవీ మొగల్‌ గా.. క్వీన్ ఆఫ్ ఆల్ మీడియాగా పేరుగాంచిన ఓప్రా విన్‌ ఫ్రే 2020లో అమెరికా అధ్య‌క్ష బ‌రిలో దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో ఆమే స్వయంగా చెప్ప‌డం విశేషం.

బ్లూమ్‌ బ‌ర్గ్ టీవీ ఫేమ‌స్ షో ద డేవిడ్ రూబెన్‌ స్టీన్ షో: పీర్ టు పీర్ క‌న్వ‌ర్జేష‌న్‌ లో ఓప్రా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. మీకున్న పేరు ప్ర‌ఖ్యాల‌తో అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాల‌ని ఎప్పుడైనా అనుకున్నారా అని ఓప్రాను రూబెన్‌ స్టీన్ ప్ర‌శ్నించారు. దీనికి కాసేపు ఆలోచించి ఓప్రా సమాధాన‌మిచ్చింది. "నేను గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి సంభాష‌ణ జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదు. అది జ‌రిగే ప‌ని కాదు కానీ, నేను కూడా అలా జ‌రిగితే ఎలా ఉంటుంది అని అనుకునేదాన్ని. కానీ దానికోసం చాలా తెలుసుకోవాల్సి ఉంది." అని ఓప్రా అభిప్రాయ‌పడింది. కానీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టాలంటే ఎలాంటి అనుభ‌వం అవ‌స‌రం లేద‌ని తెలుసు క‌దా? అని రూబెన్‌ స్టీన్ ప్ర‌శ్నించ‌గా.. నేనూ అదే అనుకున్నాన‌ని, ఇప్పుడదే ఆలోచిస్తున్నాన‌ని ఓప్రా స్ప‌ష్టంచేసింది.

గ‌తేడాది డిసెంబ‌ర్ 12న ఈ ఇంట‌ర్వ్యూ జ‌రిగినా..బ్లూమ్‌ బ‌ర్గ్ తాజాగా దీనిని ప్ర‌సారం చేసింది. ఆ వెంట‌నే దీనిపై ఆ చానెల్ ఓ చ‌ర్చ కూడా జ‌ర‌ప‌డం విశేషం. గ‌త ఎన్నిక‌ల్లో ఓప్రా.. హిల్ల‌రీ క్లింట‌న్‌ కు మ‌ద్ద‌తు తెలిపింది. 2008 ఎన్నిక‌ల్లో ఒబామా త‌ర‌ఫున ఐయోవాలో ఆమె ప్ర‌చారం కూడా చేసింది. ఈ నేప‌థ్యంలో 2020 ఎన్నిక‌ల గురించి మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News