జీవితంలో ఏం జరిగినా జరగకున్నా.. అమెరికాకు వెళ్లే అవకాశం లభిస్తే చాలు అనుకునే బ్యాచ్ చాలామందే ఉంటారు. అలా వెళ్లిన తర్వాత.. గ్రీన్ కార్డు (చట్టపరమైన శాశ్వత నివాసం) హోదా కోసం ఎదురుచూసేటోళ్లు చాలామందే ఉంటారు. గ్రీన్ కార్డు వచ్చినంతనే పెద్ద పండుగే చేసుకునే వారికి కొదవ ఉండదు.
అమెరికా మొత్తంలో 40 లక్షల మంది ప్రజలు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తుంటారని.. ఇలా వెయిట్ చేస్తున్న వారిలో మెక్సికో దేశానికి చెందిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని.. అదే విధంగా భారత్.. చైనాకు చెందిన వారి సంఖ్య కూడా భారీగా ఉంది. లక్షలాది మంది గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తుంటే..అమెరికా ప్రభుత్వం మాత్రం ఏటా కేవలం 2,26,00 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తోంది.
దీంతో.. గ్రీన్ కార్డు కోసం ఆశించే వారి క్యూ అంతకంతకూ పెరుగుతోంది. భారత్ కు చెందిన 2.27లక్షల మంది వెయిట్ చేస్తుంటే.. చైనీయులు 1.80లక్షల మంది ఉన్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో అత్యధికులు ఇప్పటికే అమెరికా పౌరసత్వం ఉండి..తమ కుటుంబ సభ్యులకు కూడా గ్రీన్ కార్డు రావాలని ఆశిస్తున్న వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఈ విధానాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. దీనిని రద్దు చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తి తమ రక్త సంబంధీకులకు శాశ్విత నివాసం కోసం స్పాన్సర్ చేసే వీలుంది. మొత్తంగా.. గ్రీన్ కార్డుకోసం క్యూ భారీగా ఉందని చెప్పక తప్పదు.