రోహింగ్యా ఎఫెక్ట్‌: సూచీకి అవ‌మానం

Update: 2017-10-01 06:11 GMT
మ‌య‌న్మార్‌లో మాన‌వ హ‌క్కుల కోసం జీవిత కాలం పోరాటం చేసిన హ‌క్కుల యోధురాలిగా గుర్తింపు పొందిన ఆంగ్‌ సాన్ సూచీకి ఘోర అవ‌మానం జ‌రిగింది.  ప్ర‌స్తుతం మ‌య‌న్మార్ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న రోహింగ్యాల విష‌యంలో సూచీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప్ర‌పంచ దేశాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. మానవ‌త్వానికి నిలువెత్తు రూపం అని అంద‌రితోనూ ప్ర‌శంస‌లు పొందిన సూచీ ఉన్న దేశంలోనే రోహింగ్యా ముస్లింల వివాదం తార స్థాయికి చేర‌డం, వారికి నిలువ నీడ కూడా లేకుండా చేయ‌డంపై ఇప్ప‌టికే అనేక దేశాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. అనేక ఉద్య‌మాలు కూడా జ‌రిగాయి.

ఈ క్ర‌మంలోనే సూచీకి ఘోర అవ‌మానం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆక్స్‌ ఫ‌ర్డ్ కాలేజీలో ప్రజ‌లు నిత్యం సంద‌ర్శించే గ్యాల‌రీలో నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌ల పెయింటింగ్‌ల‌ను ఉంచారు. వీటిలో సూచీ ఫొటో కూడా కొలువుదీరింది. అయితే, తాజాగా మయన్మార్‌ లో కొనసాగుతున్న మానవతా సంక్షోభ నేపథ్యంలో సూచీ పెయింటింగ్‌ను అక్క‌డి నుంచి  తీసేసింది. ప్రధాన ద్వారం వద్ద నున్న నోబెల్‌ గ్రహీత సూచీ పెయింటింగ్‌ ను తొలగిస్తున్నట్టు సెయింట్‌ హు కాలేజీ గవర్నింగ్‌ బాడీ నిర్ణయించింది.

నిజానికి కొత్త విద్యార్థులు రాబోతున్న క్రమంలో సూచీ పెయింటింగ్‌ను ప్రధాన ద్వారం నుంచి తీసేయ‌డం అంటే సూచీకి ఘోర అవ‌మానం కిందే లెక్క అని ఆమె అభిమానులు, మ‌య‌న్మార్ ప్ర‌జ‌లు  పేర్కొంటున్నారు.   1999 నుంచి కాలేజీ ప్రధాన ద్వారంలో ఆమె పెయింటింగ్ ఉంది. ఆంగ్‌ సాన్‌ సూచీ ఆ కాలేజీ నుంచే అండర్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు. 2012లో ఆంగ్‌ సాన్‌ సూచీ ఆక్స్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ కూడా పొందారు. 1964 నుంచి 1967 మధ్యలో రాజకీయ - తత్వశాస్త్రం - ఆర్థికశాస్త్రాలను ఆ కాలేజీలోనే అభ్యసించారు. తన 67వ జన్మదిన వేడుకలను కూడా సూచీ అక్కడే చేసుకున్నారు. దీంతో ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం సూచీని అవ‌మానించేదిగానే భావిస్తున్నారు హ‌క్కుల నేత‌లు! మ‌రి దీనిపై సూచీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News