ఇది బాబు వైఫ‌ల్యమేన‌ట‌

Update: 2016-12-31 06:44 GMT
స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయాల గురించి, నైతిక విలువ‌ల ఆవ‌శ్య‌క‌త గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడటం వింత‌గా ఉంద‌ని సీపీఎం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఎద్దేవా చేశారు.  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సుమారు రూ.200 కోట్లు ఎగ్గొట్టడంతో ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఇండియన్‌ బ్యాంక్‌ ప్రకటించడంపై చంద్ర‌బాబు ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. మంత్రి గంటా  బ్యాంకు రుణాల ఎగవేతపై తన వైఖరిని వెల్లడించాలని లేనిప‌క్షంలో బాబు మ‌ద్ద‌తుతోనే ఇది జ‌రిగింద‌ని భావించాల్సి వ‌స్తుంద‌ని మ‌ధు పేర్కొన్నారు.

నిత్యం పారదర్శకత - నిజాయతీ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు సాక్షాత్తూ తన మంత్రివర్గ సహచరుడు అక్రమాలకు పాల్పడటం ఎలాంటి పారదర్శకతో వెల్లడించాలని మ‌ధు కోరారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టడం నేరమనే విష‌యం బాబుకు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు. బ్యాంకులకు ఎగనామం పెట్టే మోసగాళ్లను మంత్రివర్గంలో పెట్టుకుని నీతివంతమైన పాలన గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్ము కాజేస్తున్నవారు మంత్రులుగా ఉండడం ఎంతవరకూ సబబని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మ‌ధు తెలిపారు. ప్రతిపక్షాలను విమర్శించడం కాకుండా తన చుట్టూ ఉన్న వారి అరాచక పోకడలపై శ్రద్ధ పెట్టడం మంచిదని ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు హితవు పలికారు. అక్రమాలకు పాల్పడుతున్న సహచర మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి ప్రకటించాలని మధు డిమాండ్‌ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News