ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరులో ఇప్పుడు ఏపీలోని దాదాపుగా అన్ని పార్టీలు కూడా పాలుపంచుకుంటున్నాయనే చెప్పాలి. నిన్నటిదాకా కేంద్రంలోని బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగిన అధికార పార్టీ టీడీపీ... గడచిన నాలుగేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని, కేంద్రం చెప్పినట్లుగా ప్రత్యేక ప్యాకేజీతోనే న్యాయం జరుగుతుందని చెప్పింది. అయితే ఏడాదిన్నరగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అపాయింట్ మెంట్ ఇవ్వకున్నా... కేంద్రం మోసాన్ని గుర్తించేందుకు సాహసించని టీడీపీ తన పాత వాదననే పట్టుకుని వేలాడింది. అయితే మొన్నటి కేంద్ర బడ్జెట్ లో కనీసం ఏపీ ప్రస్తావన కూడా లేకపోవడంతో విపక్ష వైసీపీ తన ప్రత్యేక హోదా పోరును మరింత ఉధృతం చేసిందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇంకా కేంద్రం వెంటే నడిస్తే.. మరో ఏడాదిలో రానున్న ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తప్పదని భావించిన టీడీపీ ప్రత్యేక హోదా పోరులోకి దిగేసింది. నాలుగేళ్లుగా ఎన్డీఏలో మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీ అప్పటికప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేక హోదా పోరును భుజానికెత్తుకుంది. ఈ క్రమంలో ఏపీకి ఇచ్చిన నిధులకు సంబందించి కేంద్రం, టీడీపీ సర్కారు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీకి చాలా చేశామని, తామిచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం ఏ రీతిన ఖర్చు పెట్టిందన్న విషయాన్ని చెప్పకుండానే సాగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
బీజేపీ ఆరోపణలపై టీడీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నా... చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రిగానే కాకుండా రాజధాని ప్రాంత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్డీఏ చైర్మన్ హోదాలో ఉన్న పొంగూరు నారాయణ ఇప్పటిదాకా పెద్దగా స్పందించిన దాఖలా కనిపించలేదు. అయితే చివరకు నారాయణ కూడా రంగంలోకి దిగక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. నేటి మధ్యాహ్నం అమరావతి వేదికగా మీడియా ముందుకు వచ్చిన నారాయణ... రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చినట్లుగా చెబుతున్న నిధుల ఖర్చుపై కాస్తంత వివరంగానే గణాంకాలు వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాను రాజధానికి పక్కాగానే ఖర్చు పెడుతున్నామని, ఈ విషయంలో నిధుల వ్యయానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) కూడా ఇచ్చామని ఆయన చెప్పారు. కేంద్రానికి పంపిన యూసీలను విపక్షాలకే కాకుండా అడిగిన ప్రతి ఒక్కరికి చూపించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన గట్టి సవాలే విసిరారు. రేపంతా తాను సీఆర్డీఏ కార్యాలయంలోనే ఉంటానని, దమ్మున్న ఎవరైనా వచ్చి లెక్కలు, యూసీలు పరిశీలించుకోవచ్చని కూడా ఆయన తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చినట్లుగా చెబుతున్న రూ.1500 కోట్ల నిధుల ఖర్చు లెక్కలను ప్రస్తావించిన నారాయణ... రూ.1514.16 కోట్లు ఖర్చు చేసినట్లు యూసీలు పంపించామని నారాయణ తెలిపారు. ఫిబ్రవరి 21 నాటికి పరిశీలనలో ఉన్న బిల్లులను కూడా జోడించి మార్చిలోనూ పత్రాలు పంపించామన్నారు. శాసనసభ నిర్మాణానికి రూ. 561.92 కోట్లు, రహదారులు, డ్రెయిన్లకు రూ. 512.98 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారమిచ్చామన్నారు. అమరావతి ప్రభుత్వ సిబ్బంది గృహాల నిర్మాణానికి రూ. 2209 కోట్ల అంచనా వ్యయంలో రూ.271.78 కోట్లు ఖర్చు చేసినట్లు పంపించామన్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి సలహాలిచ్చేందుకు నియమించుకున్న వివిధ కన్సల్టెంట్లకు రూ. 167.48 కోట్లు వ్యయం చేశామని, మొత్తంగా రూ.1514.16 కోట్లకు చాలా స్పష్టంగా యూసీలు సమర్పించామని నారాయణ చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని, అక్కడ 1600 కి.మీ. రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 255 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం ప్రారంభించామని నారాయణ తెలిపారు. కేంద్రం కేవలం రూ.1500 కోట్లు ఇచ్చినా, రూ.22 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. కొందరు బీజేపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడడం, ఒక వర్గం మీడియా కూడా ఇలా మాట్లాడటం సరికాదన్నారు. మరి నారాయణ సవాల్ కు స్పందించి బీజేపీ నేతలు రేపు సీఆర్డీఏ కార్యాలయానికి వెళతారా? తోక ముడుస్తారా? అన్నది చూడాలి.